వారాంతపు మార్కెట్లతో ట్రాఫిక్ జామ్

వారాంతపు మార్కెట్లతో ట్రాఫిక్ జామ్

వారాంతపు మార్కెట్లతో ట్రాఫిక్ జామ్
ఇండ్ల ముందే ఏర్పాటుచేస్తుండటంతో ఇబ్బంది
కొన్ని కాలనీల్లో పరిస్థితులు మరింత అధ్వానం
వాహనదారుల అవస్థలను పట్టించుకోని మున్సిపల్ అధికారులు, పోలీసులు
ఓపెన్ ప్లేసుల్లో నిర్వహించాలని కోరుతున్న  స్థానికులు

హైదరాబాద్, వెలుగు : వారాంతపు మార్కెట్లతో కాలనీల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కరోనాకు ముందు ఇలాంటి మార్కెట్లు పెద్దగా లేనప్పటికీ ఆ తర్వాత చాలా ప్రాంతాల్లోనూ పుట్టుకొచ్చాయి. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్​ జామ్ ​ఏర్పడి వెహికల్స్ ​రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. గ్రేటర్​తో పాటు శివారు మున్సిపాలిటీల్లోని చాలా చోట్ల ఇదే సమస్య నెలకొంది. ఇంటి గేట్ల ముందే  మార్కెట్ ఏర్పాటు చేస్తుండటంతో పెరిగిపోవడంతో ఇండ్లలోంచి జనం వారి వెహికల్స్​ను బయటకు తీయలేకపోతున్నారు. తీవ్ర ఇబ్బందుల నేపథ్యంలో ఈ మార్కెట్లను ఓపెన్ ప్లేసులో నిర్వహించాలని కోరుతున్నారు. వారాంతపు మార్కెట్లను ఎక్కడపడితే అక్కడ పెట్టకుండా చర్యలు తీసుకొని ట్రాఫిక్ సమస్యను తీర్చాలని అంటున్నారు. గ్రేటర్ పరిధి, శివారు ప్రాంతాల్లో డైలీ ఐదు వేలకు మార్కెట్లు జరుగుతుండగా.. కొన్ని చోట్ల ఎంత ట్రాఫిక్ జామ్ అయినా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

అంతటా అవే ఇబ్బందులు..

కాలనీల్లోని రోడ్లపైనే ఈ వారాంతపు మార్కెట్లు ఏర్పాటు చేస్తుండటంతో ఆ రోజు ఆయా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ ​జామ్​ ఏర్పడుతోంది. కొన్ని సందర్భాల్లో అంబులెన్స్​లు వచ్చినా బయటకు వెళ్లలేని పరిస్థితి. ఎస్​ఆర్​నగర్ పోలీసు స్టేషన్ సమీపంలోని కమిటీ హాల్ స్ట్రీట్​లో మార్కెట్ కారణంగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతోంది. మల్కాజిగిరిలోని డిఫెన్స్ కాలనీ, యూసుఫ్​గూడలోని లక్ష్మీనరసింహ నగర్, సూరారంలోని లక్ష్మీ నగర్ కాలనీ నుంచి సూరారం చౌరస్తా మధ్యలో అర కి.మీ మేర మార్కెట్ జరుగుతోంది. దీని వల్ల పరిసర ప్రాంతాలు పూర్తిగా జామ్ అవుతున్నాయి. కుత్బుల్లాపూర్ నుంచి సుచిత్ర రోడ్డు, పైప్​లైన్ రోడ్​లో నిర్వహిస్తున్న మార్కెట్లతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బండ్లగూడ జాగీర్​లో రెండు చోట్ల జరుగుతున్న మార్కెట్లతోపాటు మణికొండలో బుధవారం మార్కెట్ల వల్ల రోడ్డుపై వెళ్లలేని పరిస్థితులు ఉంటున్నాయని జనం వాపోతున్నారు. కొన్నిచోట్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కాలనీ చివర ఉంటున్న వారి పరిస్థితి దారుణంగా ఉంటోంది.

అధికారుల నిర్లక్ష్యం..

గ్రేటర్ పరిధిలో జరిగే మార్కెట్ల వల్ల జనానికి ఇబ్బంది లేకుండా చూడాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జీహెచ్ఎంసీలో టౌన్ ప్లానింగ్, శానిటేషన్ అధికారులు ఈ మార్కెట్లపై దృష్టి పెట్టడం లేదు. శివారు మున్సిపాలిటీల్లో చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు, పోలీసులు పెద్దగా పట్టించుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయినా అధికారులు చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. మార్కెట్ నిర్వాహకులకు అవగాహన కల్పించాలంటున్నారు. 

రైతు బజార్లలో అవకాశం లేక..

గ్రేటర్ సిటీలో ఆర్కే పురం, ఫలక్​నుమా, అల్వాల్, మాదన్నపేట, ఎల్లమ్మబండ, మెహదీపట్నం, వనస్థలిపురం, గుడిమల్కాపూర్, కూకట్​పల్లి, సరూర్​నగర్, ఎర్రగడ్డలో రైతు బజార్లు ఉన్నాయి. ఇవి పేరుకే రైతు బజార్లు కానీ వీటిల్లో రైతులు పెద్దగా ఉండటం లేదు. అంతా ఏజెంట్ల చేతుల్లోనే నడుస్తుండటంతో అక్కడ కూరగాయలు అమ్ముకునేందుకు రైతులకు అవకాశం లేకుండా పోయింది. రైతుబజార్లలో ఏజెంట్ల వేధింపులు తట్టుకోలేక గ్రామాల్లో పండించిన పంటలను రైతులు కాలనీల్లో నిర్వహించే మార్కెట్లకు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటున్నారు. 

మార్కెట్లు అవసరమే కానీ..

కూరగాయల కోసం మార్కెట్ల అవసరం ఉంది. కానీ ఓ క్రమ పద్ధతిలో అవి ఏర్పాటు చేస్తే  బాగుంటుంది. ఈ విషయంపై అధికారులు దృష్టి పెడితే అమ్మేవారికి, స్థానికులకు ఇబ్బందులు ఉండవు. 
- గణేశ్, లక్ష్మీనగర్ కాలనీ, సూరారం

ఇబ్బంది లేకుండా చూస్తం
మార్కెట్ల వల్ల జనం ఇబ్బంది పడుతున్నట్లు తమ దృష్టికి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులతో దీనిపై చర్చిస్తున్నాం. ఇప్పుడు కొన్నిచోట్ల చర్యలు తీసుకుంటున్నం. ఇకపై పోలీసులతో కలిసి ఇబ్బంది లేకుండా చూస్తం. ఎక్కడైనా ఇబ్బందిగా ఉంటే హెల్ప్​లైన్ నంబర్ 040-21111111 కి కాల్ 
చేసి సమాచారం ఇవ్వండి. 
- మమత, జోనల్ కమిషనర్, కూకట్​పల్లి