బాసర ట్రిపుల్ ఐటీలో అన్నీ సమస్యలే

బాసర ట్రిపుల్ ఐటీలో అన్నీ సమస్యలే
  • నీళ్లు రాక, కరెంటు లేక తీవ్ర ఇబ్బందులు 

బాసర, వెలుగు: తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క బాసర ట్రిపుల్ ​ఐటీ కాలేజీలో వసతులు కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అవుతోంది. తరచూ పవర్​కట్లతో విద్యార్థులు నరకం చూస్తున్నారు. నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగేందుకు, స్నానాలకు వాటర్​సప్లై సరిగా లేకపోవడంతో నిర్వాహకులు ట్యాంకర్లు తెప్పిస్తున్నారు. విద్యార్థులు బకెట్లతో క్యూలో నిలబడి పట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వీటికి తోడు మెస్​మెనూ పాటించట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటీవల అన్నంలో పురుగుల వచ్చాయని గుర్తుచేస్తున్నారు. రెగ్యులర్​వీసీ లేకపోవడం, ఉన్న ఇన్​చార్జ్​వీసీ కాలేజీకి రాకుండా హైదరాబాద్ నుంచే కాలేజీ వ్యవహారాలు చూడడమే కాలేజీలోని సమస్యలకు కారణమని ఆరోపిస్తున్నారు. నీటి సమస్య ఇలాగే ఉంటే కాలేజీలో ఉండి చదువుకోవడం కష్టమని ఆదివారం చాలామంది విద్యార్థులు బ్యాగులు సర్దుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. 

యూనిఫాం, ల్యాప్​టాప్స్​ ఇయ్యలే:
బాసరను ఆనుకొనే గోదావరి నది ప్రవహిస్తున్నా కోట్లు ఖర్చు చేసి కాలేజీలో పెద్ద చెరువు నిర్మించారు. అయినప్పటికీ విద్యార్థులకు నీటి కష్టాలు తప్పడం లేదు. కాలేజీలో మొత్తం 7,500 మంది విద్యార్థులు చదువుకుంటుండగా ప్రస్తుతం పీయూసీ ఫస్ట్, సెకండ్ ఇయర్, ఇంజనీరింగ్​ఫస్ట్, సెకండ్, థర్డ్​ఇయర్ స్టూడెంట్లు ఉన్నారు. వీళ్లతోపాటు స్టాఫ్ కూడా ఇదే క్యాంపస్ లో ఉంటారు. ఇటీవల తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతూ వాటర్ సప్లై సరిగా జరగడం లేదు. దీంతో స్టాఫ్, విద్యార్థులు తాగునీటికి, స్నానాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు రోజులుగా గ్రామ పంచాయతీ ఆఫీసర్లు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తుండగా, అవి కలుషితమైనవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే పరిస్థితి కొనసాగితే కాలేజీలో ఉండడం కష్టమని శని, ఆదివారాల్లో చాలా మంది బ్యాగులు సర్దుకుని ఇండ్లకు వెళ్లిపోయారు. మరో వైపు మెస్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులు మెనూ పాటించట్లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గతంలో భోజనంలో పురుగులు వచ్చిన సంగతి గుర్తుచేస్తున్నారు. తరచూ కరెంట్​పోతుండడంతో భోజనం చేసేందుకు చీకటిలో వెళ్లాల్సి వస్తోందని పిల్లలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీలోని సమస్యలపై మీడియాకు చెబితే పనిష్మెంట్​ఉంటుందని నిర్వాహకులు బెదిరించినట్లు పలువురు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఏడాది విద్యార్థులకు అందజేయాల్సిన యూనిఫాం, ల్యాప్ టాప్​లు ఇంతవరకు ఇవ్వలేదు. ట్రిపుల్ ఐటీ కాలేజీలో తాగునీటి సమస్యను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం గమనార్హం. 

కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి:
రాష్ట్రంలోని ఏకైక ట్రిపుల్ ఐటీ కాలేజీ నిర్మల్ జిల్లాలోని బాసరలో ఉంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజీకి రెగ్యులర్ ​వీసీని నియమించలేదు. ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్​ వీసీలతోనే నెట్టుకొస్తోంది. ఎస్సీ వెల్ఫేర్ ​సెక్రెటరీగా పనిచేస్తున్న రాహుల్​ బొజ్జానే ప్రస్తుతం కాలేజీకి ఇన్​చార్జ్​ వీసీగా ఉన్నారు.ఆయన కాలేజీకి రారు. హైదరాబాద్​నుంచే వ్యవహారాలు చూసుకుంటున్నారు. దీంతో ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మెరుగైన సౌకర్యాలు కల్పించి క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించేందుకు ఏర్పాటు చేసిన కాలేజీ సమస్యల వలయంలో కూరుకుపోతోంది. ఎన్నో ఏండ్లుగా వీసీని నియమించాలనే డిమాండ్​ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.