రోడ్లను తవ్వి వదిలేస్తున్నరు

రోడ్లను తవ్వి వదిలేస్తున్నరు

గ్రేటర్​లో వందల కిలోమీటర్లలో ఇదే పరిస్థితి
లాక్​డౌన్​ టైమ్​లో ఎక్కడ చూసిన తవ్వకాలే..
కేబుల్స్, వాటర్ వర్క్స్, ఇతర వాటి కోసం పనులు
పూర్తయ్యాక అలాగే వదిలేస్తున్న కాంట్రాక్టర్లు
గుంతలతో వాహనదారులకు ఇబ్బందులు
రోడ్ల తవ్వకాలపై మేయర్ సీరియస్​ 
అయినా పట్టించుకోని అధికారులు

హైదరాబాద్, వెలుగు : గతేడాది లాక్​డౌన్ లో కొత్తగా రోడ్లు వేయగా ఈ ఏడాది వాటిని ఇష్టమొచ్చినట్లు తవ్వి వదిలేస్తున్నారు. 20 రోజులుగా సిటీలో ఎక్కడ చూసినా తవ్విన రోడ్లే కనిపిస్తున్నాయి. లాక్​డౌన్​ షురూ అయినప్పటి నుంచి గ్రేటర్ పరిధిలో రాత్రి, పగలు నాన్​స్టాప్ గా రోడ్లను ఖరాబ్​ చేస్తున్నారు.  వాటర్​పైపులు, నాలాలు, కేబుల్స్ పనులంటూ రోడ్లు తవ్వి పనులు పూర్తయ్యాక మళ్లీ వేయడం లేదు. కొన్నిచోట్ల గుంతలపై మట్టి పోస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో అలానే వదిలేస్తున్నారు. రోడ్లపై వ్యర్థాలు క్లీన్​ చేయకపోవడంతో మట్టి కారణంగా దుమ్ము లేస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. వ్యాపార సముదాయాల ముందు అడ్డుగా ఉండడంతో యజమానులు ఎవరికి వారే క్లీన్​చేసుకుంటున్నారు. ప్రస్తుతం ట్రాఫిక్​ తక్కువ ఉన్న సమయంలోనే ఇలా ఉంటే లాక్​ డౌన్​ఎత్తేసిన తర్వాత కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్​ అయ్యే అవకాశం ఉంది. తవ్వకాలకు ముందు బల్దియా పర్మిషన్​ తీసుకోవాల్సి ఉండగా కొందరు కాంట్రాక్టర్లు అవేమి పట్టించుకోవడం లేదు. పర్మిషన్​తీసుకున్న ప్రాంతాల్లో పనులు పూర్తి చేసి తిరిగి రోడ్లు వేయడం లేదు. ఇలా గ్రేటర్​పరిధిలో వందలాది కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్​అయ్యాయి. ఇక అంతర్గత రోడ్లపై అడుగడుగునా గుంతలే కనిపిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇదిలా ఉంటే ఫుట్​ఓవర్​ బ్రిడ్జిల నిర్మాణ పనులు స్లోగా సాగుతుండడం, నిర్మాణాల కోసం తవ్విన మట్టిని మెయిన్​రోడ్లపై పోయడంతో మట్టికుప్పులు పేరుకుపోయాయి. 
సీఆర్ఎంపీ రోడ్లు అంతే.. 
సిటీలో 709 కిలోమీటర్ల మెయిన్​రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను ఐదేండ్ల  కాల పరిమితితో రూ.1,837 కోట్లకు ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏజెన్సీలకు జీహెచ్ఎంసీ అప్పగించింది.  ఈ రోడ్ల పూర్తి నిర్వహణ పూర్తిగా ఏజెన్సీలే చూసుకోవాలి. అయితే చాలా చోట్ల రోడ్లు తవ్వి నెలలు గడుస్తున్నా ఏజెన్సీలు పట్టించుకోవడంలేదు. ఖైరతాబాద్ జోన్​ లోని లంగర్​హౌజ్​, మెహిదీపట్నం ప్రాంతాల్లో రోడ్లు తవ్వి నెలలు దాటినా రిపేర్లు చేయలేదు.  టోలిచౌకి నుంచి మెహిదీపట్నం, కేబీఆర్​పార్కు నుంచి బసవతారకం వచ్చే దారిలో ఇతర  పనుల కోసం రోడ్లను తవ్వి పనులు అయ్యాక నామ్​కే వాస్తేగా చేసి వదిలేశారు. లాక్​ డౌన్​సమయంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు రాత్రికి రాత్రే రోడ్లను తవ్వుతున్నారు. ఏజెన్సీల కాంట్రాక్టర్లకు స్థానికులకు చెప్పినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏజెన్సీల కాంట్రాక్టర్లను అడిగితే తమకు సమాచారం లేకుండానే రోడ్లను తవ్వుతున్నారని చెబుతున్నారు.  ఒకవేళ అడిగితే పొలిటికల్​లీడర్లు బెదిరిస్తున్నారని, దీనిపై జీహెచ్ఎంసీ అధికారులకు తెలిపినా కూడా స్పందించడంలేదంటున్నారు.
3 రోజుల్లో రిపేర్ ​చేయకపోతే.. 
ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించిన రోడ్లపై గుంతలు పడితే మూడు రోజుల్లోగా రిపేర్​చేయకపోతే బల్దియా సిబ్బంది జీతాల్లో కోతలు విధిస్తామని జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ ప్రత్యేక సర్య్కూలర్ జారీ చేసినప్పటికీ రోడ్ల పరిస్థితి ఏ మాత్రం మారడంలేదు. ఈ రోడ్ల రిపేర్లు చూడాల్సిన బాధ్యత జీహెచ్ఎంసీ ఈఈ, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ, జడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలదే. మరోవైపు గుంతలను పట్టించుకోకపోతే బల్దియా స్టాఫ్ పైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ మార్పు కనిపించడంలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు కూడా లైట్​గా తీసుకుంటున్నారు. 
15 రోజులు దాటినా..
లాక్ డౌన్​కావడంతో జనం రోడ్లపైకి రావడంలేదు.  దీంతో పనులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని కేబుల్స్​, పైపు లైన్ పనులు చేస్తున్నారు. రోడ్ల తవ్వకాల పనులను ఆయా సంస్థలు కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రోడ్లు మొత్తం సత్రోల్​అవుతున్నాయి. గ్రేటర్ లో ప్రస్తుతం అన్ని జోన్లలో మెయిన్ రోడ్ల నుంచి అంతర్గత రోడ్లపైన పనులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్, ఎర్రగడ్డ, లంగర్ హౌస్, లోయర్​ ట్యాంక్ బండ్, బేగంపేట్​ తదితర ప్రాంతాల్లో రోడ్లు తవ్వి పనులు పూర్తి చేసి 15 రోజులైనా కూడా తిరిగి మళ్లీ కొత్తగా వేయలేదు.

బోరు నీళ్లలోకి డ్రైనేజీ వాటర్ కలుషితం

రోడ్లను తవ్వి వదిలేయడంతో డ్రైనేజీ పైపులు పగిలిపోతున్నాయి. దీంతో చాలా చోట్ల భూగర్భ జలాల్లోకి డ్రైనేజీ వాటర్ కలుషితం అవుతున్నాయి. తద్వారా బోరు నీటిలో కలుషితమైన వాటర్ కలుస్తుండటంతో అనారోగ్యం పాలవుతున్నారు ప్రజలు. ఉప్పల్, చిలుకానగర్ లోని, న్యూ రామ్ నగర్, ఇందిరా గాంధీ విగ్రహం సర్కిల్ వాసులు ఉండే బోరు వాటర్ లోకి డ్రైనేజీ వాటర్ కలుషితం అవుతున్నాయి. నెల రోజులైనా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. మంచి నీళ్లు అంతంత మాత్రమే వస్తున్నాయని.. కనీసం బోరు నీళ్లు వాడుకుందామంటే..డ్రైనేజీ వాటర్ వస్తుండటంతో భరించలేని దుర్వాసనతో అనారోగ్యం పాలవుతున్నామని   ఆవేదన వ్యక్తం చేశారు కాలనీ వాసులు. ఇదే విషయంపై స్థానిక కార్పొరేటర్ ను అడుగగా.. లాక్ డౌన్ కారణంగా  ఆలస్యమవుతుందని .. అధికారులను అలెర్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు. 

 

అంతర్గత రోడ్లను..
గ్రేటర్​ లో మొత్తం 9,013 కిలోమీటర్ల విస్తీర్ణంతో రోడ్లు ఉండగా, అందులో  2,846 కిలోమీటర్ల మేర బీటీ , 6,167 కిలోమీటర్ల మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి. అయితే అంతర్గత రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా కాలనీల్లో కొన్నేళ్లుగా రోడ్లు వేయకపోవడంతో పూర్తిగా రోడ్లు గుంతలు పడ్డాయి. దాదాపు 2 వేల కిలోమీటర్ల వరకు డ్యామేజ్​అయ్యాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు రోడ్లను తవ్వినా కూడా పట్టించుకునే వారు లేరు. అధికారులకు కంప్లయింట్స్​చేసినా కూడా చర్యలు తీసుకోవడంలేదని సిటిజన్స్ అంటున్నారు. 
మేయర్ సీరియస్
ఇటీవల సిటీలోని పలుచోట్ల పర్యటించిన మేయర్ రోడ్లపై వ్యర్థాలను చూసి ఫైర్ అయ్యారు. ఎక్కడికక్కడ రోడ్లను తవ్వి వదిలేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్​జోన్​లో 50 కిలోమీటర్లకు పైగా తవ్వకాలు చేశారు. ఈ జోన్​లో మేయర్ పర్యటించిన ప్రతిచోట రోడ్లపై తవ్విన వ్యర్థాలే కనిపించాయి. వెంటనే క్లీన్​చేయాలని అధికారులను ఆదేశించినా స్పందనలేదు. 
తవ్వి వదిలేశారు
 కేబుల్స్​ పనులంటూ 20 రోజులుగా రోడ్లను మొత్తం తవ్వారు.  పనులు పూర్తయ్యాక తిరిగి కొత్తగా వేయలేదు. రోడ్లను తవ్వే ముందు జీహెచ్ఎంసీ అధికారుల పర్మిషన్​ తీసుకోవాలి. ఆ తర్వాత పనులు పూర్తయ్యాక రోడ్లు వేశారో లేదో కూడా చెక్​ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. 
                                                                                                             – జెన్నా సుధాకర్, లంగర్ హౌజ్