- కేంద్రాలను పరిశీలించిన ఆఫీసర్లు
హనుమకొండ/ మహబూబాబాద్/ జనగామ, వెలుగు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లోని 260 వార్డులకు తొలిరోజు బుధవారం 49 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇందులో హనుమకొండ జిల్లా పరకాలలో 22 వార్డులకు 5 నామినేషన్లు దాఖలు కాగా, వరంగల్ జిల్లాలోని నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులకు 11 నామినేషన్లు వేశారు.
వర్ధన్నపేటలో 12 వార్డులకు 3 నామినేషన్లు వేయగా, ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు మొత్తంగా 4 నామినేషన్లు దాఖలయ్యాయి. జనగామలో 30 వార్డులకు 8 నామినేషన్లు, 18 వార్డులున్న స్టేషన్ ఘన్ పూర్ లో కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలైంది. భూపాలపల్లి మున్సిపాలిటీలో 30 వార్డులకు 4 నామినేషన్లు దాఖలవగా, మహబూబాబాద్ మున్సిపాలిటీలో 36 వార్డులకు 10, 15 వార్డులున్న మరిపెడలో 2, డోర్నకల్ లో ఒక నామినేషన్లు పడ్డాయి. ఇదే జిల్లాలోని తొర్రూరు, కేసముద్రంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన ఆఫీసర్లు
వర్ధన్నపేట/ జనగామ అర్బన్/ నర్సంపేట/ మరిపెడ : తొలిరోజు ఆయా మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఆఫీసర్లు పరిశీలించారు. వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీ కేంద్రాల్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద పలువురు ఆఫీసర్లతో కలిసి నామినేషన్ల ప్రక్రియను పరిశీలించగా, పరకాలలో హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఎన్.రవి, జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్‌కుమార్ నామినేషన్ కేంద్రాలను సందర్శించి, పలు సూచనలు చేశారు.
కాగా, మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల అబ్జర్వర్ శ్యాం ప్రసాద్‌లాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులకు హెచ్చరించారు.
