ఈ సీజన్ లో వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి : మంత్రి గంగుల

ఈ సీజన్ లో వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయి : మంత్రి గంగుల
  • ఇంకా ఉంటే 24 దాకా కొంటం: గంగుల 
  • రైతులకు ఇంకో 870 కోట్లు చెల్లించాల్సి ఉందన్న మంత్రి 
  • నిరుటితో పోలిస్తే 6 లక్షల టన్నులు తగ్గిన కొనుగోళ్లు 

హైదరాబాద్, వెలుగు: ఈ వానాకాలం సీజన్ లో వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని, 64.3 లక్షల టన్నులు కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్​ తెలిపారు. లేటుగా నాట్లేసిన రైతుల దగ్గర ఇంకా వడ్లు ఉంటే ఈ నెల 24 వరకు కొంటామని చెప్పారు. శనివారం హైదరాబాద్​లోని మినిస్టర్ క్వార్టర్స్​లో వానాకాలం వడ్ల కొనుగోళ్లపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సేకరించిన వడ్ల సీఎంఆర్​(మిల్లింగ్​)ను స్పీడప్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ‘‘పోయినేడాది అక్టోబర్​ 21న వడ్ల కొనుగోళ్లు ప్రారంభించాం. 94 రోజుల పాటు కొనుగోళ్లు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 7,024 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9.76 లక్షల మంది రైతుల నుంచి రూ.13,570 కోట్ల విలువైన వడ్లను కొన్నం. అందులో రూ.12,700 కోట్లు రైతులకు చెల్లించాం. మరో రూ.870 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ రైతులకు వారంలో చెల్లిస్తాం” అని చెప్పారు.  ఈ ఏడాది బహిరంగ మార్కెట్​లోనూ వడ్లకు అధిక ధర వచ్చిందని పేర్కొన్నారు.  

నిజామాబాద్​లో ఎక్కువ..

వానాకాలం సీజన్​లో అత్యధికంగా నిజామాబాద్​లో 5.86 లక్షల టన్నుల వడ్లు కొన్నామని గంగుల చెప్పారు. కామారెడ్డిలో 4.75 లక్షల టన్నులు, నల్గొండలో 4.13 లక్షలు, మెదక్​లో 3.95 లక్షలు, జగిత్యాలలో 3.79 లక్షల టన్నుల చొప్పున కొన్నామని తెలిపారు. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 2,264 టన్నులు, మేడ్చల్​లో 14,361, ఆసిఫాబాద్​లో 21,548, రంగారెడ్డిలో 22,164,  గద్వాలలో 24,181 టన్నుల చొప్పున కొన్నామని 
వెల్లడించారు. నిరుడు వానాకాలం సీజన్​లో మొత్తం 70.44 లక్షల టన్నుల వడ్లు కొన్నట్టు తెలిపారు. అంటే ఈ లెక్కన పోయినేడాదితో పోలిస్తే ఈసారి కొనుగోళ్లు భారీగా తగ్గాయి. 
.