నాగచైతన్య, కృతిశెట్టి జంటగా తెలుగు, తమిళ భాషల్లో వెంకట్ ప్రభు తెరకెక్కించిన చిత్రం ‘కస్టడీ’. మే 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి మాట్లాడుతూ ‘వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే నాకు చాలా ఇష్టం. సీరియస్ ఇష్యూని కూడా ఎంటర్‌టైనింగ్‌గా చెప్పగలరు. ‘గ్యాంబ్లర్’ సినిమా టైమ్ నుండి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కుదిరింది. రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ కథ ఇది. సీరియస్ స్టోరీతో పాటు తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉన్నాయి. రెండింటిని దర్శకుడు చాలా బాగా మిక్స్ చేశాడు.
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ చూడని అండర్ వాటర్ సీక్వెన్స్ తీశాం. తెలుగు ఎమోషన్స్‌తో హాలీవుడ్ స్టైల్ సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ప్రతి షాట్‌ని రెండు భాషల్లో ప్రత్యేకంగా షూట్ చేశాం. నిజానికి ‘శివ’ అనే టైటిల్ పెడదామనుకున్నారు డైరెక్టర్. కానీ పోలికలు వస్తాయి నాగచైతన్య వద్దు అన్నారు. నాగార్జున గారి కెరీర్‌లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో... నాగచైతన్య కెరీర్‌లో ఈ సినిమా అలా గుర్తుండిపోతుందనే నమ్మకముంది. ఇక రామ్, బోయపాటి కాంబినేషన్‌లో మేము నిర్మిస్తున్న సినిమా తొంభై శాతం వరకూ పూర్తయింది. రామ్ బర్త్ డేకి టీజర్ రిలీజ్ చేస్తాం. జూన్ నుండి నాగార్జున గారి కొత్త చిత్రం షూటింగ్ ఉంటుంది. అలాగే నాగచైతన్యతోనూ మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం’ అన్నారు.