ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యం..రాజ్యాంగాన్ని అడ్డుకోవడమే:ప్రొ. సింహాద్రి

ఆర్ఎస్ఎస్, బీజేపీ లక్ష్యం..రాజ్యాంగాన్ని అడ్డుకోవడమే:ప్రొ. సింహాద్రి

దేశంలో రిజర్వేషన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయం సేవక్​ చీఫ్ మోహన్​భగవత్​ అన్నారు. అర్హులైనవారికి  రిజర్వేషన్స్ కొనసాగాలని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లకు మద్దతు ఇస్తూనే ఉందని ఆయన తెలిపారు. కాగా,  రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లను ఎన్నికల ఎజెం డాగా ఇండియా అలయన్స్ పేర్కొనడంతో  బీజేపీ ఆత్మరక్షణలో పడింది.

ఈ నేపథ్యంలో  బీజేపీని గట్టెక్కించడానికి ఆర్ఎస్ఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తున్నది.  ఆర్ఎస్ఎస్​కు బీజేపీ రాజకీయ విభా గమని అందరికీ తెలుసు.  రాజ్యాంగ న్యాయం  అంతరించాలని కోరే  బీజేపీ  రిజర్వేషన్లను సమర్థించడం విడ్డూరంగా ఉంది.  మోహన్ భగవత్ 2015  బిహార్  ఎలక్షన్లలో  మాట్లాడుతూ..ఈ రిజర్వేషన్లు ఇంకెన్నాళ్లు  అని ప్రశ్నించారు?  ఆర్థిక వెనుకబాటుతనం  కేంద్రంగా రిజర్వేషన్లు ఉండాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ మొదటి నుంచీ కోరుతున్నాయి.  నిజానికి  ఆర్థిక  ఆధారిత రిజర్వేషన్లను  రాజ్యాంగం వ్యతిరేకిస్తోంది.

 సామాజిక  వెనుకబాటుతనం  కేంద్రంగా  ఉన్న  రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 15, 16 లను  ప్రశ్నించడం ఆర్ఎస్ఎస్, బీజేపీ రక్తంలోనే ఉన్నది.  రాజ్యాంగం ద్వారా విద్య, ఉద్యోగాలలో  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు  ప్రభుత్వ రంగంలో  కొంతమేరకైనా భాగస్వామ్యం పొందగలిగారు. ఈవిధంగా విద్య, ఉద్యోగాలు  పొందిన  కులాలవారిని బీజేపీ చొరబాటుదారులుగా మాట్లాడటం సరైనదేనా?

ఆర్ఎస్ఎస్, బీజేపీ సృష్టి ఈడబ్ల్యూఎస్ 

ఆర్ఎస్ఎస్, బీజేపీ ఈ రెండు సంస్థలు కలిసి సృష్టించినదే ఈడబ్ల్యూఎస్.  నిజానికి ఆర్థిక వెనుకబాటుతనంతో  పది శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సరైనదేనా? అర్హులైన వారికి రిజర్వేషన్లు అందాలని మీరే చెప్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్​లో  అర్హులైన పేదలు మూడు శాతం కంటే తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతు న్నాయి.

మరి మూడుశాతం ఉన్నవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ధర్మమేనా? అదేవిధంగా  ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, జనాభాలో  సగం ఉన్న పేదలకు ఈడబ్ల్యూఎస్​లో రిజర్వేషన్లను ఎందుకు అడ్డుకున్నారు? దేశంలో పేదరికం, సామాజిక వెనుకబాటుతనం అనే రెండు అతిపెద్ద సమస్యలకు కులమే కారణమని మండల కమిషన్ మొదటి రికమండేషన్ చెబుతున్నది.

 వీటిని నిర్మూలించడానికి మండల్ 40 రికమండేషన్లను ప్రభుత్వానికి సిఫారసు చేశారు.  ముఖ్యంగా విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లతో పాటు ప్రైవేట్ రంగలో కూడా ఓబీసీ భాగస్వామ్యాన్ని కల్పించాలని సూచించారు.  రాజకీయ  వ్యవస్థలో  కూడా వీరి జనాభా దామాషా ప్రకారం భాగస్వామ్యానికి అర్హులని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ ఏనాడూ మండల కమిషన్ రిపోర్టును సమర్థించలేదు.

ఓబీసీల గుర్తింపు నిరాకరించిన బీజేపీ 1990లో  మండల కమిషన్​కు  వ్యతిరేకంగా రామ జన్మభూమి రథయాత్రను అద్వానీ- నాయకత్వంలో జరపలేదా?  ఈ రథయా త్రను ఆర్ఎస్ఎస్​తో పాటు వారి అనుబంధ సంఘాలు సహకరించడం వాస్తవం కాదా? విద్యార్థులను ఉసికొల్పి ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ఆర్ఎస్ఎస్, బీజేపీ సంఘాలు ప్రయత్నించడం వాస్తవం కాదా? ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 సంవత్సరాలు కాబోతున్నా ఒక్క దళితుడినిగాని,  ఓబీసీని గాని,  ఆదివాసీని గాని ఆర్ఎస్ఎస్  చీఫ్ గా  నియమించారా?  మొదటి నుంచి ఈరోజు వరకు ఒకటే సామాజిక వర్గానికి చెందిన వారు ఆర్ఎస్ఎస్ చీఫ్ అవడం లేదా?

సామాజిక విప్లవకారులు

రిజర్వేషన్ల పోరాటం ఈనాటిది కాదు స్వాతంత్ర్య పోరాట సమయంలోనే రిజర్వేషన్లు కల్పించాలని మొదటగా అర్జీ పెట్టుకున్నది మహాత్మ జ్యోతిరావు ఫూలే.  సామాజిక విప్లవానికి నాంది పలికిన ఫూలేను ఏనాడైనా ఆర్ఎస్ఎస్, -బీజేపీ గౌరవించిందా, భారతరత్నతో సత్కరించిందా? అదేవిధంగా ద్రవిడ ఉద్యమ పితామహుడు పెరియార్​ను ఏనాడైనా గౌరవించారా? 1902లో మొదటిసారి సాహు మహారాజ్ బ్రాహ్మణేతరులకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తే అడ్డుకున్నది మీ వర్గానికి చెందిన తిలక్ కాదా? నాగలి దున్నుకునే వారికి,  బట్టలు కుట్టుకునే వారికి శాసన వ్యవస్థలో  ఏం పని అని అవహేళన చేసింది అతను కాదా?  రాజ్యాంగ సభలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అడ్డుకున్నది ఎదిగిన కుల సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకులు కాదా? డాక్టర్  బీ.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనకు నాయకత్వం వహించకుంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలనే వారు ఈ దేశంలో ఉండేవారేనా? రాజ్యాంగ కమిషన్ ద్వారా ఓబీసీలను గుర్తించి రిజర్వేషన్లు కల్పించాలని, వారి ఉన్నతికి ప్రభుత్వం తోడ్పడాలనే ఆలోచన ఆర్ఎస్ఎస్, -బీజేపీ నాయకత్వంలో వచ్చేదా?

దేశానికి పునాది రాజ్యాంగం

ఆర్ఎస్ఎస్ ఏనాడు ఈ దేశానికి పునాది అయిన రాజ్యాంగాన్ని గౌరవించలేదు. వారు మను రచించిన రాజ్యాంగాన్ని కోరుకుంటూ వచ్చారు.  ఎందుకంటే మను, సామాజిక పరాన్నజీవులకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తున్నాడు కాబట్టి. ఉత్పత్తి కులాలను, సేవా కులాలను, చేతి వృత్తి కులాలను, సాంస్కృతిక సంపద ఉన్న శక్తులను మను ఏనాడూ గౌరవించలేదు.

వాళ్లని శూద్రులుగా, అతిశూద్రులుగా ఆస్తులకు, అధికారానికి, అవకాశాలకు దూరంగా ఉంచమన్నాడు. వారిని సేవకులుగానే చూడాలన్నాడు. ఇంత దుర్మార్గపు ఆలోచనతో కూడిన మను రాజ్యాంగాన్ని మీరు కోరుకోవడం న్యాయమేనా? ఇది ముమ్మాటికి రాజ్యాంగ న్యాయానికి విరుద్ధం. రాజ్యాంగ ధర్మాన్ని అడ్డుకునే దుర్బుద్ధి. అంతరాలను సృష్టించే మను సిద్ధాంతంపై రాజ్యాంగ వర్గాలు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. బ్రాహ్మణీయ శక్తులపై పోరాటం శూద్ర- శక్తులు చేస్తూనే ఉంటాయి. అందులో భాగంగానే  2024 ఎలక్షన్స్ చాలా కీలకమైనవిగా గుర్తిస్తున్నారు.

మనువాద శక్తులు 2024 ఎన్నికల్లో అధికారాన్ని తమ వశం చేసుకుంటే ముందుతరాలు ఊహించని అమానవీయమైన జీవితాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కాబట్టి, రాజ్యాంగ వర్గాలు తమ రాజ్యాంగ అధికారం, పాలన కోసం బీజేపీని తిరస్కరించాలి!

- ప్రొ. సింహాద్రి సోమనబోయిన,రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్​వాది పార్టీ