హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని రక్షించాలంటే ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ పాత్ర కీలకమని, ఇతర పార్టీలో ఉన్న వారు కూడా ఇందులో భాగస్వాములు కావచ్చని ఏఐసీసీ ప్రొఫెషనల్స్ ఛైర్మన్ మధు యాష్కీ అన్నారు. శనివారం గాంధీ భవన్ లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ నిర్మాణంలో, పాలసీల రూపకల్పనలో ప్రొఫెషనల్స్ పాత్ర చాలా ముఖ్యమన్నారు. పరిపాలనలో పారదర్శకత కోసం ఏ పార్టీలో అయినా షాడో మినిస్ట్రీ అవసరమ న్నారు. దీని ద్వారా బయట విషయాలు తెలుసుకోవచ్చన్నారు.
తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీసుకొని జిల్లా స్థాయిలో ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ను బలోపేతం చేస్తామని చెప్పారు. దేశంలోని 100 అర్బన్ జిల్లాల్లోని టీచర్స్, లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ తో పాటు ఇతర రంగాల్లోని నిపుణులతో మొదటి దశలో ఏఐసీసీ కమిటీని నియమిస్తానని చెప్పారు. ఏఐసీసీ ప్రొఫెషనల్స్ చైర్మన్ గా నియమితులైన మధు యాష్కీ మొదటిసారి గాంధీ భవన్ కు వచ్చిన సందర్భంగా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ శాలువా కప్పి సత్కరించారు.
