ప్రొఫెసర్​ చేయి నరికిన్రు.. కటకటాల పాలయ్యిర్రు

ప్రొఫెసర్​ చేయి నరికిన్రు.. కటకటాల పాలయ్యిర్రు

కేరళలో 2010లో సంచలనం సృష్టించిన ప్రొఫెసర్​ చేయి నరికిన కేసులో దోషులుగా దేలిన ఆరుగురిలో ముగ్గురికి జీవిత ఖైదు విధిస్తూ ఆ రాష్ట్రంలోని ఎన్​ఐఏ కోర్టు జులై 13న తీర్పునిచ్చింది. కోర్టు దీన్ని ఉగ్రవాద చర్యగా పేర్కొంది. కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

ఇడుక్కి జిల్లాలోని తొడుపుజాలోని న్యూమాన్ కళాశాల ప్రొఫెసర్ టీజే జోసెఫ్ కుడి చేతిని ఇప్పుడు నిషేధించిన రాడికల్ ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు జూలై 4, 2010న నరికివేశారు. తీవ్ర వాద సంస్థలో భాగమైన నేరానికి సంబంధించి సజిల్, నాసర్,  నజీబ్‌లకు ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు న్యాయమూర్తి అనిల్​ కే భాస్కర్ కఠినమైన చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద జీవిత ఖైదు విధించారు. 

మిగిలిన ముగ్గురు దోషులు - నౌషాద్, పీపీ మొయిదీన్ కున్హు, ఈ కేసులో నేరస్థులకు ఆశ్రయం కల్పించినందుకు అయూబ్‌కు మూడేళ్ల శిక్ష పడింది. 'ఈ ఘటన అందర్ని కదిలించింది. నిందితుల చర్య పూర్తి చట్ట వ్యతిరేకమైనది. ఇలాంటివి సమాజం సహించదు. 

ఉగ్రవాదంతో సమానమైన ఈ చర్యను వ్యతిరేకిస్తున్నాం. స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ఘటనలకు చోటు లేదు' అని కోర్టు ఆర్డర్​లో పేర్కొంది. దోషులు ఉపశమనం పొందడానికి అర్హులు కారని స్పష్టం చేసింది.