మూలవాసీ బచావో మంచ్​ లీడర్లను రిలీజ్ చేయాలి : హరగోపాల్

మూలవాసీ బచావో మంచ్​ లీడర్లను రిలీజ్ చేయాలి : హరగోపాల్
  • ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్

ఖైరతాబాద్, వెలుగు: ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం అరెస్ట్​ చేసిన మూలవాసీ బచావో మంచ్ నాయకులను వెంటనే రిలీజ్​ చేయాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్​హరగోపాల్ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై పోలీసుల దాడులను ప్రజాసంఘాలు  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో సమావేశం నిర్వహించారు. 

హరగోపాల్​తోపాటు సంఘాల నేతలు ప్రొఫెసర్ లక్ష్మణ్, కన్నెగంటి రవి పాల్గొని మాట్లాడారు. ఛత్తీస్​గఢ్​లోని  మూలవాసీ బచావో మంచ్(బస్తర్) నాయకులను అక్కడి పోలీసులు అక్రమంగా అరెస్ట్​ చేశారని మండిపడ్డారు. సమావేశం పెట్టుకునేందుకు అనుమతి కోసం ఎస్పీ, కలెక్టర్ల వద్దకు వెళ్లి, తిరిగి వస్తున్న సోడి భీమా, సునీత పొట్టం, మడకం జోగా, మడకం జోషప్ ను అదుపులోకి తీసుకోవడం అన్యాయం అన్నారు. 

సమావేశానికి అనుమతి ఇవ్వకపోగా, నాయకులను అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తునికాకు సేకరణకు అడవుల్లోకి వెళ్తున్న మహిళలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిజానిజాలు తెలుసుకోవడానికి వెళ్లిన తమ బృందాలను అడ్డుకోవడం తగదన్నారు. సమావేశంలో రైతుకూలీ సంఘం జాతీయ నాయకుడు వెంకట్రామయ్య, నారాయణరావు, రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు.