బీసీల స్కీం కోసం 1931 నాటి లెక్కలపైనే ఆధారపడుతున్నం

బీసీల స్కీం కోసం 1931 నాటి లెక్కలపైనే ఆధారపడుతున్నం

హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లవుతున్నా.. ఇప్పటికీ బీసీల పథకాల కోసం 1931లో బ్రిటీష్​ వాళ్లు తీసిన లెక్కలపైనే ఆధారపడుతున్నామని బీసీ పొలిటికల్​ ఫ్రంట్​ అధ్యక్షుడు ప్రొఫెసర్​ కె.మురళీమనోహర్​ అన్నారు. ఆనాడు తీసిన లెక్కలతోనే రాజ్యాంగంలో ఓబీసీలను చేర్చారని, అప్పట్నుంచి ఇప్పటిదాకా బీసీ కుల లెక్కలను ఏ ప్రభుత్వమూ చేపట్టలేదని ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్​లోని సోమాజిగూడ ప్రెస్​ క్లబ్​లో నిర్వహించిన రౌండ్​ టేబుల్​ సదస్సులో ఆయన మాట్లాడారు. 

ఆ ఆర్టికల్​ పూర్తిగా మోసపూరితమైనది

ప్రతిసారి జనాభా లెక్కల్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల లెక్కలు తీస్తున్న ప్రభుత్వాలు.. బీసీల లెక్కలు మాత్రం తీయడం లేదని, రాజ్యాంగంలో ఓబీసీలుగా చేర్చినప్పటికీ దానికి సరైన డెఫినిషన్​ ఇవ్వలేదని మురళీమనోహర్ అన్నారు. ఆర్టికల్​ 340తో రిజర్వేషన్లను ఇస్తున్నా.. ఆ ఆర్టికల్​ పూర్తిగా మోసపూరితమైనదని అన్నారు. రాజ్యాంగం గుర్తించని కులాలకు రిజర్వేషన్లు ఇవ్వొద్దని చెప్పినా.. ఇస్తూనే ఉన్నారని చెప్పారు. ఆనాటి మండల్​ కమిషన్​ నుంచి రోహిణి కమిషన్​ వరకు బీసీ లెక్కలు తీయాలని చెప్పినా ఎవరూ వినిపించుకోలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు బడ్జెట్​లో కేటాయిస్తున్నది నామమాత్రమేనని చెప్పారు. రాష్ట్ర సర్కారు 9 ఏండ్లలో రూ.14.88 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టినా.. బీసీలకు ఇచ్చింది 2.1 శాతమే అని, కేంద్ర బడ్జెట్​లో బీసీలకు కేటాయించింది 0.5 శాతం కన్నా తక్కువేనని  ఆరోపించారు. 

ఉన్నత స్థానాల్లో పెద్ద కులాల వాళ్లే ఉన్నరు

దేశంలో అసలు రాజ్యాంగమే లేదని, అది ఉంటే ఈడబ్ల్యూఎస్​ రిజర్వేషన్లను ఎట్ల ఇస్తారని టీజేఎస్​ నేత ప్రొఫెసర్​ పీఎల్ విశ్వేశ్వర్ రావు ​ప్రశ్నించారు. కేవలం 6% జనాభా ఉన్నోళ్లకు 10% రిజర్వేషన్లు ఎందుకిచ్చారన్నారు. వివిధ విభాగాల్లోని ఉన్నత స్థానాల్లో 70% మంది పెద్ద కులాల వాళ్లే ఉన్నారని, యూనివర్సిటీల్లో 63% వీసీలు, గవర్నర్లకు 60% సెక్రటరీలు వాళ్లే ఉన్నారని అన్నారు. ఐపీఎస్​ల్లో 8%, ఐఏఎస్​ల్లో 11%, సీబీఐలో 5% మందే ఓబీసీలున్నారని, ఐఐటీల్లో 4%, ఐఐఎంల్లో 2.8%, సెంట్రల్​ వర్సిటీల్లో 9% మందే బీసీలున్నారని ఆయన తెలిపారు. ఇలానే కంటిన్యూ అయితే దేశంలో రాజ్యాంగమన్నది ప్రమాదంలో పడుతుందని, దీనిపై పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, బీసీ కులాల లెక్కలు చేపట్టాల్సిందేనని సదస్సుకు హాజరైన వివిధ పార్టీల నేతలు, ప్రొఫెసర్లు డిమాండ్​ చేశారు. సమావేశానికి రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, మంత్రి గంగుల కమలాకర్, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కాంగ్రెస్​ నేత మధుయాష్కీ గౌడ్​ రావాల్సి ఉన్నా పలు కారణాలతో హాజరు కాలేదు.