సమాజ శ్రేయస్సు కోసమే మీడియా: ప్రొఫెసర్ కె.స్టీవెన్ సన్

 సమాజ శ్రేయస్సు కోసమే మీడియా: ప్రొఫెసర్ కె.స్టీవెన్ సన్
  • ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రధానమైంది
  •  ఓయూ జర్నలిజం డిపార్ట్​మెంట్ హెడ్ స్టీవెన్ సన్
  •  కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజ్​లో నేషనల్ సెమినార్
  •  హాజరైన వివిధ రాష్ట్రాల స్టూడెంట్లు

ముషీరాబాద్, వెలుగు: సమాజ శ్రేయస్సు కోసం మీడియా ఎంతో అవసరమని ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్​మెంట్ హెడ్ ప్రొఫెసర్ కె.స్టీవెన్ సన్ అన్నారు. నైతిక విలువలను కలిగిన జర్నలిజం ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. ‘వర్తమాన కాలంలో మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంకేతిక రంగాల్లో మీడియా పాత్ర’ అనే అంశంపై బాగ్ లింగంపల్లిలోని కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ డిగ్రీ కాలేజ్​లో తురగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నేషనల్ సెమినార్ జరిగింది. ప్రొఫెసర్ స్టీవెన్ సన్ చీఫ్​గెస్ట్​గా హాజరై మాట్లాడుతూ సమాజంలో మేధోపరమైన విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. సమాజంలోని లోపాలను ఎత్తిచూపుతూ రెండు వైపులా పదనున్న కత్తిలాగ మీడియా పనిచేస్తోందన్నారు. 

మీడియాపై దాడిని అరికట్టాలి

ఫేక్ న్యూస్​ను కట్టడిచేస్తూ మీడియాపై జరుగుతున్న దాడిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా ఇన్వెస్టిగేటివ్ ఎడిటర్ సుధాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా న్యూ మీడియా, టెక్నాలజీ రంగం అభివృద్ధి, సాంకేతికలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్​పై మీడియా కనెక్టివిటీ గురించి స్టూడెంట్లకు వివరించారు. విప్లవాత్మక శక్తిగా సోషల్ మీడియా సమాజంలో దూసుకుపోతోందని సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సుధాకర్ రావు అన్నారు. రాజకీయ పార్టీల తీరు, సంచలనాత్మక విషయాలను మీడియా చూపలేకపోయినా సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలు బయటకు వస్తున్నాయన్నారు.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్ సత్య ప్రకాశ్ రెడ్డి, నేషనల్ సెమినార్ కన్వీనర్ గుంటి కృష్ణ కుమార్ స్టూడెంట్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సెమినార్​లో కాకా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇనిస్టిట్యూషన్స్ జాయింట్ సెక్రెటరీ రమణ, డైరెక్టర్లు రిషికాంత్, రత్న, ఫ్యాకల్టీ, పలు రాష్ట్రాల స్టూడెంట్లు పాల్గొన్నారు.