- రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి
- తెల్లాపూర్ పునరుజ్జీవ సభలో
- ప్రొఫెసర్ కంచ ఐలయ్య డిమాండ్
- లేకపోతే రాష్ట్రం శాశ్వతంగా నష్టపోవచ్చు
- ఒక్క తూటా దిగిన గాంధీ జాతిపిత అయితే..
- ఆరు బుల్లెట్లు దిగిన గద్దర్ జాతిపిత ఎందుకు కాడు?
- సీఎం సీటు కన్నా ఆ హోదా ఎంతో గొప్పదని కామెంట్
సంగారెడ్డి/రామచంద్రాపురం, వెలుగు: ప్రజా గాయకుడు గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెఫర్డ్ డిమాండ్ చేశారు. సీఎం సీటు కన్నా జాతిపిత హోదా ఎంతో గొప్పదన్నారు. గద్దర్ ను జాతిపితగా ప్రకటించకపోతే తెలంగాణ సమాజం శాశ్వతంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 1997 ఏప్రిల్6న గద్దర్‌పై కాల్పుల ఘటనను నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో సోమవారం సాయంత్రం గద్దర్ పునరుజ్జీవ సభ నిర్వహించారు. అంతకుముందు గద్దర్ గళం ఆధ్వర్యంలో మేధావులు, సామాజికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కంచ ఐలయ్య మాట్లాడుతూ ఎలాంటి పదవి, ఆస్తులు సంపాదించని గాంధీ మాదిరిగానే గద్దర్ కూడా నిస్వార్థ ఉద్యమం చేశారన్నారు. గాంధీ మాదిరిగానే గద్దర్ కూడా కాల్పులకు గురయ్యారన్నారు. ‘‘ఒక్క తూటా దిగిన గాంధీ జాతిపిత అయ్యిండు. ఆరు బుల్లెట్లు దిగిన గద్దర్ ఎందుకు జాతిపిత కాకూడదు? గద్దర్‌ను ప్రభుత్వం జాతిపితగా ప్రకటించి, రాష్ట్ర ప్రజల దృష్టిలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి” అని ఐలయ్య పేర్కొన్నారు.
తెలంగాణ జాతిపితగా కేసీఆర్ ప్రకటించుకోవడంపై ప్రభుత్వం స్పందించాలన్నారు. కేసీఆర్‌ను జాతిపితగా పేర్కొంటూ ఫిబ్రవరి 17న హోర్డింగులు, కటౌట్లు, బ్యానర్లు వేయించుకున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి లోపు..పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి గద్దర్‌ను తెలంగాణ జాతిపితగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే తెలంగాణ ప్రజానీకం క్షమించదన్నారు. కేసీఆర్ పవర్లోకి రాగానే కొడుకును, బిడ్డను దింపి పదేళ్లలో వేల ఎకరాల భూములు, లెక్కలేనన్ని ఫామ్ హౌజ్‌లు సంపాదించారని ఐలయ్య ఆరోపించారు.
ఒక్క కాళేశ్వరంలోనే లక్ష కోట్ల అవినీతి జరిగిందని విచారణ జరుగుతుండగా.. కేసీఆర్తనను జాతిపితగా ప్రకటించుకోవడం ఏందని నిలదీశారు. గద్దర్ గుండెల్లో బుల్లెట్లు దిగడానికి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబే కారణమని ఆరోపించారు. అద్దంకి దయాకర్ మాట్లాడుతూ వేదికపై ప్రతిపాదించిన ప్రజాభీష్టాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్ పర్సన్ విమలక్క, పాశం యాదగిరి, గద్దర్ గళం వ్యవస్థాపకుడు కొల్లూరి సత్తయ్య, బేబీ రాజు, పృథ్వీరాజ్, డాక్టర్ శ్రీనివాస్, గుడిపల్లి రవి, కార్యక్రమ నిర్వాహకుడు మాజీ కౌన్సిలర్ భరత్, పసునూరి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
గద్దర్ పాట గెలిచింది.. తూటా ఓడిపోయింది
ముషీరాబాద్, వెలుగు: 1997 ఏప్రిల్ 6న గద్దర్ పై జరిగిన కాల్పులను గుర్తు చేసుకుంటూ పాటపై తూటా పేరుతో సోమవారం రాత్రి హైదరాబాద్ బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గద్దర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ప్రొఫెసర్ కాసిం, అల్లం నారాయణ, కోయ వెంకటేశ్వర్, గద్దర్ కుమారుడు సూర్యం హాజరయ్యారు. నారాయణ మాట్లాడుతూ గద్దర్ తన ఆటపాటలతో ప్రజలను చైతన్యం చేశారని అన్నారు. ఆయన పాట గెలిచి తూటా ఓడిపోయిందన్నారు. తెలంగాణ ప్రజా జీవితంలో గద్దర్ మార్పు తీసుకువచ్చారని కోదండరాం అన్నారు. అల్లం నారాయణ మాట్లాడుతూ ఐదు దశాబ్దాల విప్లవంలో గద్దర్ యోధుడు అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ప్రధాన భూమిక వహించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
