ఇంజనీర్లు హెచ్చరించినా..కేసీఆర్​ పట్టించుకోలే

ఇంజనీర్లు హెచ్చరించినా..కేసీఆర్​ పట్టించుకోలే
  •     ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే కాళేశ్వరం కట్టిండు: కోదండరాం
  •     ప్రాణహితను ఆగం జేసిండు
  •     కేసీఆర్​ మూడోసారి గెలిచి ఉంటే నదుల కింద ఆయకట్టు విధ్వంసమయ్యేది
  •     ఆ ప్రమాదం నుంచి ప్రజలు కాపాడారని వ్యాఖ్య
  •     కాళేశ్వరం లోపాలపై దొంతుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​

హైదరాబాద్, వెలుగు :  తెలంగాణ ఉద్యమస్ఫూర్తి నుంచి ఆవిర్భవించి ప్రాణహిత – చేవెళ్ల లిఫ్ట్ స్కీమ్​ను ఆంధ్రా కాంట్రాక్టర్ల జేబులు నింపడానికే కాళేశ్వరం పేరుతో కేసీఆర్​ రీ డిజైన్​ చేశారని టీజేఎస్​చీఫ్​ప్రొఫెసర్​కోదండరాం అన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి నీటిని తెచ్చుకునే అవకాశం ఉన్నా గత  ప్రభుత్వం దాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టిందని మండిపడ్డారు. ఇంత మంచి ప్రాజెక్టును పక్కన పెట్టి గోదావరి – కృష్ణా లింక్​ప్రాజెక్టు అని కేసీఆర్​ తెరపైకి తెచ్చారని, ఆయన మూడోసారి గెలిచి ఉంటే రెండు ప్రధాన నదుల కింద ఆయకట్టు విధ్వంసం అయ్యేదని, కొన్ని పైపుల కంపెనీలు, కాంట్రాక్టర్లు మాత్రమే బాగుపడేవారని అన్నారు. 

ప్రజలు ఆ ప్రమాదం నుంచి తెలంగాణను కాపాడారని ఆయన తెలిపారు. కాళేశ్వరం లోపాలపై తెలంగాణ ఇంజనీర్స్​ఫోరం కన్వీనర్​దొంతుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో పవర్ పాయింట్​ప్రజెంటేషన్​ జరిగింది. ఇందులో కోదండరాం మాట్లాడారు. కాళేశ్వరంలోని లోపాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయని అన్నారు. ఈ ప్రమాదాలను రిటైర్డ్​ఇంజనీర్లు, నిపుణులు హెచ్చరించినా.. హన్మంతరావు లాంటి ప్రముఖ ఇంజనీర్లు చెప్పినా కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు.

 ‘‘ఎక్కడ పైసలు సప్పుడు చేస్తయో.. అక్కడ జ్ఞానం పని చేయదు..’ అనేది ఎనుకటి సామెత.. కాళేశ్వరం విషయంలో కేసీఆర్ వ్యవహరించిన శైలికి అది నిదర్శనంగా నిలుస్తుంది. రికార్డుల కోసం పనులు చేశారు తప్ప ప్రాజెక్టు పది కాలాలు నిలిచి ఉండాలనే లక్ష్యం, చిత్తశుద్ధి లోపించింది” అని కోదండరాం అన్నారు. ‘‘నదికి అడ్డం కట్టలు కడుత.. ఎత్తిపోస్తం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఎగువ నుంచి నీటిని తీసుకొని దిగువ ప్రాంతాలకు కాల్వల ద్వారా నీళ్లు ఇస్తేనే తక్కువ ఖర్చుతో సాగునీరు అందుతుంది. దానికి విరుద్ధంగా భారీ ఖర్చుతో కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మించారు. నిపుణులతో రూపొందించిన ప్రాణహిత లాంటి ప్రాజెక్టును కేసీఆర్​ ఆగం చేశారు” అని మండిపడ్డారు. మల్లన్నసాగర్​తోనూ భవిష్యత్​లో ప్రమాదాలు ఎదురవుతాయని తెలిపారు. 

ప్రభుత్వాన్ని కూల్చడానికి మీరెవరు?

బీఆర్ఎస్​నాయకులు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని అంటున్నారని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడానికి వాళ్లెవరని కోదండరాం ప్రశ్నించారు. ‘‘ప్రజల తీర్పును స్వీకరించడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. తమ దగ్గర పైసలు ఉన్నాయి కాబట్టి తమదే రాజ్యం అన్న ఆలోచనలో వాళ్లు ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలను కూల్చుతామనడం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.

ఇలాంటి రాజకీయాలు పోవాలి” అని అన్నారు. అక్రమాలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. రూ.వంద లంచం తీసుకొని ఏసీబీకి చిక్కినోళ్లను జైలుకు పంపుతున్నారని.. వందలు, వేల కోట్ల అవినీతి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. ఇది కాళేశ్వరం అక్రమాలను బయట పెట్టే ప్రజెంటేషన్​మాత్రమే కాదని, అవినీతితో అక్రమంగా కూడబెట్టిన కోట్ల రూపాయలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్న వారిని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చే ప్రయత్నం అని కోదండరాం అన్నారు. మిషన్​భగీరథతో ఉపయోగం లేదని చెప్పిన చీఫ్​ఇంజనీర్​పై కేసీఆర్ కన్నెర్ర చేశారని, అక్రమాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ రకరకాలుగా వేధించారని మండిపడ్డారు. 

ఇంకా పాత వాళ్లేనా?: పాశం యాదగిరి

నేరస్తుడే జడ్జిమెంట్​ఇచ్చినట్టు అక్రమాలకు పాల్పడ్డ ఇరిగేషన్​ఈఎన్సీనే మొన్నామధ్య ఐదుగురు మంత్రుల ముందు కాళేశ్వరం గొప్పదని పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ఇచ్చారని సీనియర్​జర్నలిస్టు పాశం యాదగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్​రెడ్డి వేదికపై కేసీఆర్​ ప్రజెంటేషన్​ఇచ్చినట్టుగా అది ఉందని అన్నారు. కొత్త ప్రభుత్వంలో మంత్రుల చుట్టూ మూగుతున్న వారంతా పాత ప్రభుత్వంలో ఉన్నవాళ్లేనని.. వాళ్లను చూస్తుంటే అసలు కాంగ్రెస్​ప్రభుత్వం వచ్చిందా లేదా అనే అనుమానం కలుగుతుందని పేర్కొన్నారు.

‘‘బీఆర్ఎస్​ప్రభుత్వాన్ని ఇంటికి పంపడం మా బాధ్యత అనుకుని పనిచేశాం. అది కాంగ్రెస్​ బాధ్యత అనుకున్నట్టు లేదు. ప్రస్తుత ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే పార్లమెంట్​ఎన్నికల్లో దెబ్బతింటారు” అని అన్నారు.  జస్టిస్​చంద్రకుమార్​మాట్లాడుతూ..  అవినీతి పరులను పక్కన పెట్టి నిజాయితీ గల అధికారులను నియమిస్తేనే కొత్త ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు. 

తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తీస్కోవడమే మంచిది:  లక్ష్మీనారాయణ

2014 జూన్​2వ తేదీ నాటికి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై (ప్రాణహిత - చేవెళ్ల కలుపుకొని) రూ.41 వేల కోట్లు ఖర్చు చేస్తే 50.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని రిటైర్డ్​ఇంజనీర్, తెలంగాణ ఇంజనీర్స్ ​ఫోరం కన్వీనర్ ​దొంతుల లక్ష్మీనారాయణ అన్నారు. కానీ కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రూ.38 వేల కోట్ల ప్రాణహితను రీ డిజైనింగ్​పేరుతో రూ.1.30 లక్షల కోట్లకు పెంచారని, అప్పటికే రూ.11 వేల కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టును పక్కన పెట్టారని తెలిపారు.

ప్రాణహిత ప్రాజెక్టులో ఎకరా సాగుకు రూ.2.34 లక్షలు ఖర్చయితే.. కాళేశ్వరంలో రూ.4.50 లక్షలు ఖర్చవుతున్నాయని, ఒక్కో ఎకరం సాగుకు కరెంట్​బిల్లులకే రూ.50 వేలు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. తుమ్మిడిహెట్టి నుంచి నీళ్లు తీసుకోవడమే తెలంగాణకు శ్రేయస్కరమని సూచించారు. ‘‘కేసీఆర్​రీ డిజైన్​ పేరుతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంపుహౌస్​లు, బ్యారేజీల కోసం రూ.30 వేల కోట్ల భారం మోపారు. అయినా వాటితో ప్రయోజనం లేదు. ఈ బ్యారేజీలకు రిపేర్లు చేసినా మళ్లీ సమస్యలొస్తాయి.

 మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోసినా ఎగువ నుంచి వరద వస్తే వాటిని మళ్లీ కిందికి వృథాగా వదిలేయాలి. కాళేశ్వరం.. ముమ్మాటికీ తిప్పిపోతల పథకమే” అని అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద యావరేజీగా (50 శాతం డిపెండబులిటీ వద్ద)1,122 టీఎంసీల నీటి లభ్యత ఉందని సీడబ్ల్యూసీ నివేదికలే చెప్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ​ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నిర్మించాలని కోరారు. ఇరిగేషన్​ ఈఎన్సీ మురళీధర్​ ఇచ్చిన పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ తప్పుల తడక అని ఆయన మండిపడ్డారు.