- ఇది ప్రజాస్వామ్యాన్ని బలహీనపర్చే చర్య: కోదండరాం
- దేశంలో 13 కోట్ల ఓట్లు తొలగించారు
- రాష్ట్రంలో ప్రతి వంద మందిలో 21 ఓట్లు పోయాయని వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: అర్హులైన వారి ఓట్లను తొలగించడం అన్యాయమని ఎమ్మెల్సీ, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఓటు హక్కును నిరాకరించే చర్యలను ప్రజాస్వామ్యవాదులంతా కలిసి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. బుధవారం నాంపల్లిలోని టీజేఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే హక్కు ఉండాలని, ఆ హక్కును అణిచివేయడం, నిరాకరించడం చట్టవ్యతిరేకమన్నారు.
ఎన్నికల సంఘంలో ముగ్గురు కమిషనర్లు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఫార్మ్-6లో మార్పులకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చిందని తెలిపారు. ఈసీకి చట్టబద్ధంగా మార్పులు సూచించే అవకాశం ఉందే తప్ప.. ఇష్టానుసారంగా మార్పులు చేసే అధికారం లేదన్నారు. ‘సర్’ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారని, తెలంగాణలో సుమారు 93 లక్షల ఓట్లు.. అంటే ప్రతి వంద మందిలో 21 ఓట్లు తొలగించారని ఆరోపించారు.
నేడు అఖిలపక్ష ర్యాలీ
నెక్లెస్ రోడ్డులోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి లోక్‌భవన్ వరకు గురువారం అఖిలపక్ష ర్యాలీ నిర్వహించనున్నట్లు కోదండరాం వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి నిర్వహించే ఈ ర్యాలీలో పార్టీలకు, సిద్ధాంతాలకు అతీతంగా ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ)కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. అశ్వద్ధామరెడ్డి నాయకత్వంలోని కూటమికి మద్దతు ఇవ్వాలని టీజేఎస్ నిర్ణయించిందన్నారు. టీజేఎస్ నూతన కార్యవర్గాన్ని కూడా కోదండరాం ప్రకటించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రొఫెసర్ పి.ఎల్. విశ్వేశ్వర్‌రావు, సయ్యద్ బద్రుద్దీన్, అంబటి శ్రీనివాస్, కుంట్ల ధర్మార్జున్ తదితరులను నియమించారు.
