
- 10 ఎంపీ సీట్లు గెలుచుకునేలా పనిచేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లలో గెలుపు లక్ష్యంగా బీజేపీ హైకమాండ్ కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ బన్సల్ బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ నియోజకవర్గాల క్లస్టర్ల సమావేశంలో, ఆ తర్వాత ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వివిధ కమిటీలతో అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బన్సల్ సమావేశమయ్యారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో హైకమాండ్ ఇచ్చిన ప్రోగ్రామ్‌లు కొనసాగుతున్న తీరుపై సమీక్షించారు. వచ్చే నెల 5 నుంచి 8 వరకు ‘చలో గావ్’ ప్రోగ్రామ్ కొనసాగించాలని నిర్ణయించారు. ప్రతి పోలింగ్ బూత్‌లో నాయకులు, కార్యకర్తలు మకాంవేసి పార్టీ పరిస్థితి, ప్రోగ్రామ్ లు జరగుతున్న తీరును సమీక్షిస్తారు. వచ్చే నెల 5 నుంచి 14 వరకు కొనసాగించాలనుకున్న యాత్రలను ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. మూడు నుంచి నాలుగు లోక్ సభ నియోజకవర్గాలను కలిపి ఒక క్లస్టర్‌గా రాష్ట్రంలో మొత్తం ఐదు క్లస్టర్లను ఏర్పాటు చేశారు.
ఐదు క్లస్టర్లలో ఒకేసారి యాత్రలను ప్రారంభించాలన్నారు. మోదీ సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే టర్గెట్గా ఈ యాత్రలు కొనసాగనున్నాయి. యాత్రల్లో రాష్ట్ర, జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 31 లోపు ‘ ఫిర్ ఏక్ బార్ మోదీ’ పేరుతో గోడలపై వాల్ రైటింగ్ చేయించాలని నిర్ణయించారు. ఇందులో మోదీ ఫొటో, కమలం గుర్తు ఉండనుంది. వచ్చే నెలలో హైదరాబాద్‌లో ‘కిసాన్ సమ్మేళనం’ నిర్వహించాలని నిర్ణయించారు.
బీజేపీ హైకమాండ్ ఇచ్చిన ప్రోగ్రామ్‌లను అనుకున్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లకపోవడం, వివిధ కమిటీలు టార్గెట్ పూర్తి చేయకపోవడంపై రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో పార్టీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని అవకాశంగా మలుచుకొని 10 సీట్లు.. 35 శాతం ఓట్లను సాధించాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర పర్యటనకు రానున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యక్రమాల ఖరారు, వాటిని విజయవంతం చేయడంపై కూడా చర్చించారు.