కలెక్టర్లు ఓకే చేసినా ధరణిలో మారుతలె

కలెక్టర్లు ఓకే చేసినా ధరణిలో మారుతలె
  • నిషేధిత జాబితా నుంచి సర్వే నంబర్లు తొలగించినా మళ్లీ కనిపిస్తున్నయ్

హైదరాబాద్, వెలుగు: భూ సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు స్పందించినా ధరణి పోర్టల్ మాత్రం కరుణించడం లేదు. నిషేధిత భూముల జాబితా నుంచి సర్వే నంబర్లను కలెక్టర్లు తొలగించినా మళ్లీ కనిపిస్తుండడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పెట్టుకున్న దరఖాస్తులను కలెక్టర్ ఓకే చేసినట్లు సెల్ ఫోన్​కు మెసేజ్ వచ్చాక.. అప్లికేషన్ స్టేటస్ చెక్ చేస్తే మళ్లీ కలెక్టర్ కు అప్లై చేసుకోవాలని ధరణి పోర్టల్ సూచించడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కలెక్టర్ ఓకే చేశాక మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.

ఏడాది తిరిగినా ఎదులాబాద్ రైతుల బాధ తీరలే..

రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం ఎదులాబాద్ లోని సీతారామచంద్ర ఆలయానికి నల్గొండ జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని సర్వే నంబర్ 153లో 18 గుంటల భూమి ఉంది. ఈ సర్వే నంబర్​ను నిషేధిత జాబితాలో చేర్చాల్సి ఉండగా, స్టాంప్స్ అండ్ రెవెన్యూ, ఎండోమెంట్ అధికారులు ఎదులాబాద్ వద్ద ఉన్న 153 సర్వే నంబర్​లోని 14.32 ఎకరాల భూమిని ప్రొహిబిటెడ్ లిస్టులో చేర్చారు. ఫలితంగా ఈ సర్వే నంబర్​లో భూమి ఉన్న రైతులు అవస్థలు పడుతున్నారు. తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధిత రైతులు ఏడాదిగా కలెక్టర్, ఎండోమెంట్ కమిషనర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ చుట్టూ తిరుగుతున్నారు. కోర్టులో కేసు వేసి రెండుసార్లు కోర్టు ఆర్డర్లు కూడా తెచ్చుకున్నారు. ఇన్నిరకాల ప్రయత్నాల తర్వాత ఎండోమెంట్ కమిషనర్ ఎన్వోసీ(నో అబ్జక్షన్ సర్టిఫికెట్) ఇవ్వగా కలెక్టర్ ఇటీవల ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి సర్వే నంబర్ ను తొలగించారు. అయినా ఇప్పటికీ ధరణి పోర్టల్ లోని ప్రొహిబిటెడ్ లిస్టులోనే ఆ సర్వే నంబర్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ధరణిలో వారి అప్లికేషన్ నంబర్ స్టేటస్ చెక్ చేస్తే ‘గ్రీవెన్స్ అప్రూవ్డ్ బై కలెక్టర్’ అని చూపిస్తోంది. కానీ ల్యాండ్ డీటైల్స్ సెర్చ్ లో వారి సర్వే నంబర్లను ఎంట్రీ చేస్తే ప్రొహిబిటెడ్ లిస్టులో నుంచి మీ భూమిని డిలీట్ చేసేందుకు కలెక్టర్ కు ధరణిలోని టీఎం 15 ద్వారా అప్లై చేసుకోవాలని సూచించడం గమనార్హం.