
శాయంపేట, వెలుగు : రూ. 15 లక్షలు లోన్ ఇప్పిస్తామని చెప్పిన సైబర్ నేరగాళ్లు.. వివిధ చార్జీల పేరుతో రూ. 6.6 లక్షలు కాజేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి అఖిల్‌రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. గతేడాది ఫేస్‌బుక్ చూస్తుండగా.. లోన్ యాప్‌కు సంబంధించిన లింక్ కనిపించడంతో.. దానిని ఓపెన్ చేసి లోన్ రిక్వెస్ట్ పెట్టాడు.
తర్వాత ఓ గుర్తు తెలియని వ్యక్తి అఖిల్‌కు ఫోన్ చేసి తాను రిలయన్స్ ఫైనాన్స్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నానని, రూ.15 లక్షల లోన్ కావాలంటే ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 6,500 చెల్లించాలని చెప్పాడు. దీంతో అతడు ఇచ్చిన అకౌంట్‌కు అఖిల్ డబ్బులు పంపించాడు. ఆ తర్వాత లోన్‌కు సంబంధించిన నాలుగు ఈఎంఐ చార్జీలు రూ.58 వేలు, ఆర్‌బీఐ చార్జీలు రూ. 10 వేలు పంపాలని చెప్పడంతో అవి కూడా పంపించాడు.
ఇలా పలు దఫాలుగా వివిధ చార్జీల పేరుతో రూ.3,22,870 వసూలు చేశారు. మరో వైపు ధని ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి చేస్తున్నామని చెప్పి మరికొందరు రూ. 3,43,226 తీసుకున్నారు. ఇలా మొత్తం రూ.6,66,096 చెల్లించాడు. తర్వాత ఆయా కంపెనీల నుంచి ఎవరూ ఫోన్ చేయకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన అఖిల్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 13న మరోసారి శాయంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసినట్లు ఎస్సై పరమేశ్వర్ తెలిపారు.