హామీలు అమలు చేయకపోతే..పార్టీల గుర్తింపు రద్దు చేయాలి : కె శ్రీనివాసాచారి

 హామీలు అమలు చేయకపోతే..పార్టీల గుర్తింపు రద్దు చేయాలి : కె శ్రీనివాసాచారి

ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తాపత్రయంతో రాజకీయ పార్టీలు తమకు తోచినట్టుగా హామీలు ఇచ్చి ప్రజలను ఏక్ దిన్ కా సుల్తాన్లను చేసి, తాత్కాలికంగా లోబరుచుకోవడానికి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించి ప్రజలను మభ్యపెడుతున్నాయి. ఓట్ల పండగ ముగిశాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను మరిచిపోయి, ఐదేండ్లు తమ ఇష్టం వచ్చినట్టు పరిపాలించి ప్రజలను, ఓటర్లను వెర్రి వెంగళప్పలను చేస్తున్నాయి. ఈ పార్టీ, ఆ పార్టీ అనే భేదం లేదు, ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అనే తేడాలు లేవు. అన్ని పార్టీలదీ ఈ దేశంలో అదే తంతు.

మెనిఫెస్టోలకు జవాబుదారీ ఏది?

ప్రజాస్వామ్య దేశంలో ప్రజల ఓట్ల ద్వారా ప్రతినిధులుగా ఎన్నికైనవారు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండవలసిన అవసరం ఉంది. చేసిన బాసలు, ఇచ్చిన హామీలు, చూపిన ఆశలు కల్లలు చేయడం వల్ల ప్రజలకు ఎన్నికల వ్యవస్థపైన, రాజ్య వ్యవస్థ పైన నమ్మకం సడలే అవకాశం ఉంది. భారత రాజ్యాంగం అత్యంత పటిష్టమైనదైనా రాజకీయ పార్టీల నిర్మాణము, పనితీరు, వ్రాసి ఇచ్చిన మానిఫెస్టోల అమలు, ఐదు సంవత్సరాలలో వాటిని పూర్తి చేయకపోతే తీసుకోబోయే చర్యలను ఎక్కడా ప్రస్తావించకపోవడం వల్ల రాజకీయ పార్టీలు, పార్టీల అధినేతలు

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మూకుమ్మడిగా ప్రజలను మోసబుచ్చుతూనే ఉన్నారు. కనుకనే ‘సచ్చినోడి పెళ్లికి వచ్చినవే కానుకలు’ అన్నట్టు తమ జీవితాలను ఎలాగూ ప్రభావితం చేయని ఎన్నికల పండుగలో తమ వాటా గురించి ప్రజలు రోడ్డు ఎక్కుతున్నారు. ఈ దుస్థితి ప్రజాస్వామ్య వికాసానికి పెద్ద ఆటంకంగా మారింది.

మూకస్వామ్యం!

నిజానికి ప్రజాస్వామ్యానికి ప్రత్యామ్నాయం మరింత మంచి ప్రజాస్వామ్యమే తప్ప వేరేది లేదు. రాజకీయ పార్టీలు లేకుండా ప్రజాస్వామ్యం పరిఢవిల్ల గలుగుతుంది, కానీ రాజకీయులు గ్రామ పంచాయితీ స్థాయి నుంచి కేంద్ర ప్రభుత్వ స్థాయి వరకూ రాజకీయాలను పార్టీల చుట్టే తిప్పడం వల్ల వ్యక్తికి విలువ తగ్గి, పార్టీకి విలువ పెరిగి మూక మనస్తత్వం, మూకస్వామ్యం  ప్రబలుతున్నది. అందుకే మన దేశంలో ప్రజాస్వామ్యం పేరున నడుస్తున్నదంతా పార్టీస్వామ్యమే! 

ఈసీకి మరిన్ని అధికారాలు ఉండాలి 

ఈ విష వలయం నుంచి దేశం బయట పడాలంటే ప్రజల చేతనాత్మకస్థాయి హేతుబద్ధంగా, శాస్త్రీయంగా మారవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా రాజకీయ పార్టీల నిర్మాణం, పనితీరు, హామీల అమలు ఎన్నికల సంఘ పర్యవేక్షణ క్రింద ఉండాలి. ఎన్నికల సంఘం అంటే కేవలం ఎన్నికలు జరిపించి చేతులు దులుపుకునేందుకు కాదు కదా! ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తు.చా తప్పకుండా అమలు చేయించగలిగే పర్యవేక్షణాధికారం ఎన్నికల సంఘానికి ఉండి తీరవలసిందే! దీనికి చట్టపరమైన ఏర్పాట్లు కూడా చేయాలి.

రాజకీయ పార్టీలు పార్టీస్వామ్యాన్ని ఎగదోసినప్పుడు, పార్టీ అధినాయకత్వం విచ్చలవిడిగా అధికారం చలాయించినప్పుడు  న్యాయవ్యవస్థ జోక్యం చేసుకొని మార్గదర్శనం చేసే, అవసరమైతే దండించే విశేషాధికారాలు ఉండాలి. ఇచ్చిన హామీలను ఐదు సంవత్సరాల వ్యవధిలో సంపూర్ణంగా అమలు చేయలేక పోయినట్లయితే ఆ పార్టీ  గుర్తింపును రద్దు చేసి, కనీసం పదేండ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలి. అప్పుడు మాత్రమే ఉచిత హామీలు, అభూత, అవాస్తవిక, అశాస్త్రీయ, అనుత్పాదక  హామీలకు కళ్ళెం పడుతుంది.

- కె శ్రీనివాసాచారి,  సోషల్ అనలిస్ట్