డబ్బు, మద్యానికి అమ్ముడుపోకండి: యువత రాజకీయాల్లో రాణించాలి

డబ్బు, మద్యానికి అమ్ముడుపోకండి: యువత రాజకీయాల్లో రాణించాలి

ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. ఇపుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఓ అసెంబ్లీ ఉప ఎన్నిక వచ్చింది. అలాగే పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది.  కొంత సమయం పట్టినా పంచాయతీ ఎన్నికలు తప్పక జరగనున్నాయి. కాబట్టి  స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా యువత మంచి రాజకీయాల కోసం పోటీ చేయాలి. అలాగే  కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది.  

ఓటు హక్కును పొందడం, వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత. ఉప ఎన్నిక అయినా,  పంచాయతీ ఎన్నికలైనా ఓటును సద్వినియోగం చేసుకోవాలి.  ఓటర్లు తమ ఓటు హక్కుతో నచ్చిన వారికి అధికారం కట్టబెడతారు. ఓటుహక్కు అనేది వజ్రాయుధం లాంటిది. ప్రతి ఎన్నికలో పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు ఇస్తుంది. డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోకుండా ఓటుహక్కు వినియోగించుకోవాలి. 

యువత మేలుకోవాలి..

వార్డు సభ్యుల నుంచి సర్పంచ్​, ఉపసర్పంచ్​పదవులకు పోటీ పడాలి. మంచి రాజకీయాలను తేవాలి.  ప్రజల ఓట్లను డబ్బుతో, మద్యంతో కొనుక్కుని  సర్పంచ్ పదవిని చేజిక్కించుకుంటున్నవారు ఉంటున్నారు. గ్రామాలలో యువకులు అర్హత ఉండి, డిగ్రీలు, పీజీలు చదువుకొని జ్ఞానవంతులై ఉండి కూడా ఊరికి అన్యాయం జరుగుతుందని ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఈ సర్పంచ్ పదవికి నామినేషన్​ వేయడం లేదు.

కారణం ఏమిటి? రాజకీయాలు తెలియకా?  డబ్బు లేకపోవడమా? తెలివితేటలు లేకపోవడమా? ప్రజలను పరిపాలించే సత్తా, దమ్ము లేకపోవడమా? ప్రజలకు నీతివంతమైన పరిపాలన అందించే సత్తా, ధైర్యం ఉంటే.. సర్పంచ్​పదవికి ప్రతి గ్రామంలో పోటీ చేయండి. ఓడినా ఫర్వాలేదు మరోసారి గెలుస్తారు. ఆరోగ్యకర రాజకీయాలను, అభివృద్ధి రాజకీయాలను తేవాల్సింది యువతనే అనే విషయం నేటితరం మర్చిపోకూడదు.

- సొప్పరి నరేందర్,  హెచ్​సీయూ  విద్యార్థి