
ఈ విద్యా సంవత్సరం నుంచి ములుగులో సమ్మక్క- సారక్క కేంద్ర గిరిజన యూనివర్సిటీ తరగతులను ప్రారంభించింది. ఇటీవల కేంద్ర మంత్రులు దర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డిలు యూనివర్సిటీ లోగోను ప్రారంభించడం జరిగింది. యూనివర్సిటీ లోగో దేశంలోని మిగతా రెండు గిరిజన యూనివర్సిటీల కంటే తనదైన ప్రత్యేకతను చాటుకుంది.
ఆసియాలోనే పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క సారక్క తల్లుల త్యాగం, ధైర్యం, సేవా భావం, ఆదివాసీల సంప్రదాయాలు ఉట్టిపడేలా లోగోను తీర్చి దిద్దడంతో ప్రత్యేకతను సంతరించుకుంది. లోగోలో ఏర్పరచిన జ్ఞానదీపం మానవుల పట్ల సమానతను, చైతన్యం కలిగించేలా ప్రేరణను ఇస్తుందని లోగో రూపకల్పన ద్వారా తెలుస్తోంది. ప్రతిబింబించిన ఆదివాసీ ప్రజల సంప్రదాయాలు, గౌరవం, ప్రకృతిపట్ల కృతజ్ఞత, జ్ఞానమనే దీపం, సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే ప్రధాన దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది.
సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ లోగో పరిశీలిస్తే.. మధ్యలో ఎర్ర సూర్యుడు- కుంకుమ (వెర్మిలియన్), పసుపు రంగులో సమ్మక్క, సారక్క గద్దెలు, గిరిజన సంస్కృతిలో భాగమైన నెమలి ఈకలు, చుట్టూ జంతు కొమ్ములున్నాయి. కానీ, ఆదివాసీ తెగల ఉనికిని గుర్తించే ఆకుపచ్చ రంగును విస్మరించడం వారి అస్తిత్వాన్ని ప్రశ్నిస్తోంది! ఆకుపచ్చ లోటు ప్రకృతిని, అటవీ హక్కులను అనుభవించే ఆదివాసీల ఉనికికి ప్రశ్న్తార్ధకమవుతుంది.
వర్సిటీ మోటోను గిరిజన భాషలు, సంస్కృత పదాల సమ్మిళితం చేసి 'దుమ్- జ్ఞాన్- సుదారన్' అని హిందీలో రాశారు. వీటి అర్థం.. దుమ్ అంటే విద్య, జ్ఞాన్ అంటే జ్ఞానం, సుదారన్ అంటే అభివృద్ధి అని, దాని కింది వరుసలో సంస్కృతంలో 'జ్ఞాన్ పరమ్ ధ్యేయమ్' అని ఉంది. లోగోను రూపొందించడంలో సృజనాత్మకత, సాంస్కృతిక అవగాహన, శాస్త్రీయత లోగోకు ప్రత్యేకమైన ఆకర్షణగా, విశ్వవిద్యాలయ ఆత్మను ప్రతిబింబించేలా, ఆదివాసీ ప్రజల సాంస్కృతిక మూలాలను జ్ఞాన కాంతితో మేళవించి ప్రతిభతో ప్రతిష్టాత్మకంగా రూపకల్పన చేయడం జరిగింది.
ములుగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఆదివాసి సంస్కృతిని పరిరక్షిస్తూ, సమానత, సాధికారత, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతుందనే ఆశాభావంతో రూపకల్పన చేశారు. తెలంగాణ ఏర్పాటు చట్టంలో చేయబడ్డ ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు పదేళ్ల నిర్లక్ష్యం వెంటాడింది. అయినా పూర్తిస్థాయి కోర్సులతో, ఆచార్యుల నియామకంతో, ఆదివాసీ సంస్కృతితో యూనివర్సిటీ నిర్మాణం జరగలేదు.
ఆదివాసీ సమస్యలకు పరిష్కార వేదికగా నిలవాలి
ఈ యూనివర్సిటీ కేంద్రంగా ఆదివాసీ సమస్యలకు పరిష్కార వేదికగా నిలవాలి. అణచివేతలకు గురౌతున్న ఆదివాసీలపై చర్చ జరగాలి. 13వ శతాబ్దంలోనే అగ్రవర్ణ సమాజం అయిన కాకతీయ రాజులపై పోరాడిన సమ్మక్క సారక్కలకు సరైన గుర్తింపు ఇవ్వాలి. మేడారం కేంద్రబిందువుగా కలిగిన ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేయాలి.
చట్టాలు ఉండి ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు అక్రమ రాజకీయ రిజర్వేషన్లు ఇంకెంతకాలం అమలు చేస్తారు..? ప్రభుత్వం పాటిస్తున్న అసమతుల్యమైన విద్య, ఉద్యోగ రిజర్వేషన్ల వల్ల రాజ్యాంగపరంగా నిజమైన ఆదివాసీలు ఆర్ధిక స్వావలంబనకు, సాధికారతకు చేరుకునే దెన్నడు? ఇత్యాది సమస్యలకు పరిష్కారం దొరకాలి. ఉపాధ్యాయులు, గిరిజన విద్యార్థులు ఈ లోగోలోని ఆత్మను మనసులో దాల్చి ‘జ్ఞానం ద్వారా శక్తి, శక్తి ద్వారా సేవ, సేవ ద్వారా సమాజ మార్పు’అనే భావనతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలోని మెజారిటీ ఆదివాసీ తెగలకు ఉపయోగపడేలా నిబంధనలు రూపొందిస్తేనే సెంట్రల్ వర్సిటీ లక్ష్యం నెరవేరుతుంది.
- గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపకుడు