వికారాబాద్, వెలుగు: అనేక వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను అమలుచేయడంలో విఫలమైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా నవాబుపేటలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ మీటింగులో ఆమె మాట్లాడారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ మీటింగులో ఎమ్మెల్యే కాలే యాదయ్య కోసం ఒక కుర్చీ ఏర్పాటు చేశారు.
ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లడంతో నిరసనగా ఇలా ఆయనకు కుర్చీ వేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఎన్.శుభప్రద్‌పటేల్, రాష్ట్ర విద్య, మౌళిక వసతుల కల్పన కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.నాగేందర్‌గౌడ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
