
హైదరాబాద్, వెలుగు: సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తామని, ఆరోగ్యకరమైన తెలంగాణ తమ అభిమతమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ తన బృందంతో కలిసి మంత్రి తుమ్మలను కలిశారు. తాము అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయం వివరాలను పాలేకర్ మంత్రికి వివరించారు.
ప్రాచీన పద్ధతుల్లో సహజ వనరులను వినియోగిస్తూ తక్కువ ఖర్చుతో సాగు చేయడంపై దేశవ్యాప్తంగా వేల మంది రైతులకు శిక్షణ కల్పించామని పాలేకర్ తెలిపారు. మంత్రి మాట్లాడుతూ, సేంద్రీయ సాగు దిశగా రైతులను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ ఇచ్చేందుకు పాలేకర్ సంస్థ సహకారం తీసుకుంటామన్నారు.