
- 282 మంది అసోసియేట్లకు ప్రొఫెసర్లుగా ప్రమోషన్
- ఉత్తర్వులు జారీ చేసిన హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది కొరతను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 282 మంది అసోసియేట్ ప్రొఫెసర్లను ప్రొఫెసర్లుగా ప్రమోట్ చేస్తూ హెల్త్ సెక్రటరీ క్రిస్టినా చోంగ్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కార్డియాలజీ, సర్జికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, పీడియాట్రిక్ సర్జరీ వంటి 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ పదోన్నతులు కల్పించారు.
ఈ 282 మంది ప్రొఫెసర్లకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ హాస్పిటల్స్‌లో పోస్టింగ్‌లు కేటాయించారు. మరో 28 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు త్వరలో ప్రొఫెసర్‌గా పదోన్నతులు లభించనున్నాయి. ఈ చర్యలతో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ల కొరత తీరనుంది.
అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదోన్నతులకు సన్నాహాలు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్లను అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అదనంగా, 714 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇటీవల 44 మంది సీనియర్ ప్రొఫెసర్లను అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఏడీఎంఈ)గా ప్రమోట్ చేసి, వారిని మెడికల్ కాలేజీల ప్రిన్సిపల్స్, టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెండెంట్లుగా
నియమించింది.
ప్రభుత్వంపై డాక్టర్ల సంఘం ప్రశంసలు
ఈ పదోన్నతి ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా, సీనియారిటీ ఆధారంగా చేపట్టిందని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) ప్రెసిడెంట్ డాక్టర్ కిరణ్, సెక్రటరీ జనరల్ డాక్టర్ కిరణ్ మాదాల, ట్రెజరర్ డాక్టర్ రమేశ్, వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ కిరణ్ ప్రకాశ్, డాక్టర్ సుమలత ప్రశంసించారు. మూడు అర్హత గల బ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకోవడం, కాలేజీల వారీగా డీపీసీ జాబితాల విడుదల, రాష్ట్రవ్యాప్త ఖాళీల జాబితా ఇవ్వడం, ఎంపిక అవకాశాలు కల్పించడం, సూపర్ స్పెషాలిటీల కోసం హైదరాబాద్‌ను చేర్చడం వంటి చర్యలను కొనియాడారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని ఏ ప్రభుత్వం తీసుకోలేదని పేర్కొంటూ రేవంత్ ప్రభుత్వానికి
ధన్యవాదాలు తెలిపారు.