ఎక్సైజ్ కానిస్టేబుల్ రూ.23 కోట్ల ఆస్తులు జప్తు

ఎక్సైజ్ కానిస్టేబుల్ రూ.23 కోట్ల ఆస్తులు జప్తు

అక్రమంగా డ్రగ్స్ విక్రయించి అమ్మి కొట్లాది రూపాయలు కూడబెట్టిన  ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆస్తులను అధికారులు జప్తు చేశారు.  షాద్‌నగర్ పోలీసులు, తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో  రూ.23 కోట్ల ఆస్తులు జప్తు  చేశారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 32 ఏళ్ల కామారెడ్డి ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ గొల్ల రమేష్, గుండుమల్ల వెంకటయ్య ఇద్దరు కలిసి అల్రాజోలం దందా చేసేవారు. 2023 డిసెంబర్ 25వ తేదీన వెంకటయ్య అల్రాజోలం విక్రయిస్తుండగా  టీన్యాబ్ అధికారులు రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు. 

నిందితులు ఇద్దరు  అక్రమంగా డ్రగ్‌ను విక్రయించి షాద్‌నగర్‌లోని 866.66 చదరపు గజాల విస్తీర్ణంలో నాలుగు ఓపెన్ ప్లాట్లు, 22 ఎకరాల వ్యవసాయ భూమి, 6 లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్‌ను కూడబెట్టారు. ఈ ఆస్తులను  జప్తు చేసినట్లుగా టీఎస్‌ఎన్‌ఏబీ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.  

ఇందులో వెంకటయ్య పేరు మీద షాద్నగర్ వద్ద ఉన్న నాలుగు ప్లాట్లు, 21.26 ఎకరాల భూమి, షాబాద్ మండలంలో 13.04 ఎకరాల భూమి, ఆయన భార్య పేరు మీద 2.22 ఎకరాల భూమి, బ్యాంకులోని రూ.4.29 లక్షల నగదు ఉన్నాయి. ఎక్సైజ్ కానిస్టేబుల్ రమేశ్ కు  చెందిన మారుతి షిప్ట్ కారు, బ్యాంక్ ఖాతాల్లోని రూ.2.21 లక్షల నగదును అధికారులు  సీజ్ చేశారు.  నార్కోటిక్స్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 8 (సి), 29 కింద కేసులు నమోదు చేశారు.