
5 రోజులు.. 10 శాతమే నమోదు
మరో పదిరోజుల్లో ధరణి సర్వే డెడ్‌లైన్
గ్రేటర్లో14.50 లక్షల ఇండ్లు
సర్వేలో 5,900 మంది సిబ్బంది
పూర్తిస్థాయి వివరాలు లేకుండానే నమోదు
హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ పరిధిలో దసరాకు ధరణి పోర్టల్ రెడీ కావడం కష్టంగానే కనిపిస్తుంది. ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి బల్దియా ఉన్నా సర్వే స్పీడ్‌గా కొనసాగడం లేదు. 10 రోజుల్లో కంప్లీట్ చేయాలని అధికారులకు నిర్దేశించింది. అయితే ఆ లోపు కంప్లీట్ కావడం కష్టమేనని మరో 5 రోజులు పెంచింది. మొత్తంగా 15రోజుల్లో పూర్తి చేసేందుకు అన్ని డిపార్టుమెంట్ల కిందిస్థాయి సిబ్బందిని సర్వే కోసం కేటాయించారు. టార్గెట్ఇచ్చి మరీ సర్వే పూర్తయ్యేలా చూడాలని అధికారులు ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి సిబ్బంది ఇంటింటికీ వెళ్లినా ఫలితం కనిపించడం లేదు. యాప్ సర్వర్ డౌన్లో ఉంటుండగా పలు చోట్ల సిబ్బందికి ఇంటి ఓనర్లు సహరించక లేటు అవుతుంది. గడిచిన 5 రోజుల్లో 10 శాతం సర్వే కంప్లీట్ అయ్యింది. మరో 10 రోజుల్లో 90 శాతం పూర్తి కావాల్సి ఉంది. గడువులోగా పూర్తి కాదని స్పష్టమవుతుంది. దసరాకు ధరణి పోర్టల్ ని షురూ చేయాలని ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
చెప్పిందే ఆన్లైన్లో ఎంట్రీ
ప్రజలకు తమ ఆస్తులపై పూర్తి హక్కు కోసమే ధరణి సర్వే చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు, అధికారులు చెబుతున్నారు. హడావిడిగా ఆస్తుల వివరాలను ఆన్లైన్ లోఎక్కించడం ఎందుకని జనం ప్రశ్నిస్తున్నారు. సర్వే సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుండగా నామమాత్రంగానే చేస్తున్నారు. ఇంటి సమగ్ర డాటా కలెక్ట్ చేయకుండానే ప్రజలు చెప్పింది ఆన్ లైన్ లో ఎంట్రీ చేసుకొని వెళ్తున్నారు. కొందరు ఓనర్లు మరణించినా కూడా వారి వివరాలనే తీసుకొని ఆన్ లైన్ లో ఎంటర్ చేస్తున్నారు. కొందరు ఓనర్స్ ఫారెన్, ఇతర ప్రాంతాకు వెళ్లిన వారు ఉన్నారు. వారి వివరాలు కూడా మారిపోయే అవకాశముంది.
బల్దియా లిస్టులో వాటికి డబుల్టైమ్
గ్రేటర్ లో మొత్తం ఆస్తుల డాటా 24 లక్షలు ఉండ గా, జీహెచ్ఎంసీ జాబితాలో 14.50 లక్షలు ఉన్నా యి. ముందుగా లిస్టులో ఉన్న వాటినే సర్వే చేస్తున్నారు. మొత్తం 5,900 సిబ్బంది పాల్గొంటున్నారు. ఐదు రోజుల్లో లక్ష40 వేల ఇండ్లు పూర్తి చేశారు. ఇంకా చేయాల్సింది 13 లక్షలకుపైనే. ఇలాగే కొనసాగితే మరో నెల రోజులు టైమ్ పడుతుంది. ఇక బల్దియా జాబితాలో లేని 19.50లక్షల ఇండ్ల సర్వే చేయాలంటే ఇంతకు డబుల్సమయం పట్టొచ్చు.
నోటరీ ఇండ్లపై నో క్లారిటీ
సర్వేలో ఏవైనా మిస్టేక్స్ వస్తే ఫ్యూచర్ లో ఆస్తుల గొడవలు మరింత పెరిగే చాన్స్ఉంది. ప్రాపర్టీ చెల్లించే ఓనర్లకు పెద్ద సమస్యలు రాకున్నా, నోటరీలు ఉన్న వారిని సర్వే చేస్తే చాలా ప్రాబ్లమ్సే వస్తాయి. పలు ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నోటరీలు ఇద్దరు, ముగ్గురు వద్ద కూడా ఉంటున్నాయి. ఇప్పటికే వీటిపై రోజూ ఏదో ఒకచోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆన్లైన్ లో వివరాలు ఎక్కించి ఓనర్లకు సొంతం చేస్తామని చెబుతుండడంతో కబ్జాదారులు మరింత మంది పెరగొచ్చు. బల్దియా ఇలాంటి ఇండ్ల వివరాలను సర్వే చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందనే దానిపై క్లారిటీ లేదు.
సర్వర్ డౌన్ ప్రాబ్లమ్
ధరణి సర్వే కోసం సిబ్బందికి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు. స్మార్ట్ ఫోన్లలో యాప్‌ని డౌన్ లోడ్ చేసుకొని సర్వే వివరాలు పొందుపర్చాలని మాత్రమే ఆదేశించారు. సర్వర్ డౌన్ కారణంగా ఒక్కో ఇంటివద్ద గంట సేపు కూర్చోవాల్పి వస్తుందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు తగిన ఏర్పాట్లు చేసుంటే బాగుండేదని పేర్కొంటున్నారు. సిబ్బంది ఇబ్బందులు పడుతూనే సర్వే కొనసాగిస్తున్నారు.
ఇండ్ల తర్వాత ఓపెన్ ప్లాట్లు
గ్రేటర్లో ఓపెన్‌ప్లాట్లు ఉన్న ఓనర్స్లోనూ టెన్షన్ మొదలైంది. తమ సర్వే చేయడం లేదని కొందరు ఆఫీసులకు వెళ్లి కంప్లయింట్లు చేస్తున్నారు. ముందుగా ఇండ్ల సర్వే పూర్తయ్యాక.. ఓపెన్ ప్లాట్ల సర్వే చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
For More News..