ప్రాపర్టీ ట్యాక్స్​ చెక్కులు  బౌన్స్​ అయితున్నయ్

ప్రాపర్టీ ట్యాక్స్​ చెక్కులు  బౌన్స్​ అయితున్నయ్
  • గ్రేటర్​లో  ఇలాంటోళ్లు 2 వేల మంది  ఓనర్లపై లీగల్​ యాక్షన్​కు బల్దియా రెడీ 
  • ప్రాపర్టీ సీజ్ తో పాటు కోర్టులో కేసు ఫైల్
  • ఆస్తి పన్ను వసూలుతోనే సిబ్బందికి శాలరీలు 
  • సర్కిల్ 15, 16 లో  పలువురు బిల్ కలెక్టర్లకు మెమోలు

హైదరాబాద్, వెలుగు: బల్దియా పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్​వసూళ్లలో భాగంగా బకాయిదారులు చెక్కులను ఇస్తుండగా బౌన్స్​అవుతున్నాయి. ప్రాపర్టీ దారులు సమయానికి డబ్బులు ఇవ్వలేకపోతుండగా బల్దియా అధికారులు అడ్వాన్స్​ చెక్కులను తీసుకుని వెళ్తున్నారు. వాటిని సంబంధిత బ్యాంకుల్లో డిపాజిట్​చేయగా ఖాతాల్లో నిల్వ ఉండడంలేదు. ఇలా గ్రేటర్ లోని 30 సర్కిళ్లలో 1500 నుంచి 2 వేల మంది ప్రాపర్టీదారుల చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇందులో రూ.50 వేల నుంచి రూ.5 లక్షలపైగా ఉన్నవి ఉన్నాయి.  ఇలా కొంతకాలంగా చెక్​బౌన్స్ లు అవుతూనే ఉండగా మళ్లీ వారి వద్దకు వెళ్లి రీకవరి చేసేవారు. కానీ ఇక నుంచి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు బల్దియా అధికారులు రెడీ అయ్యారు. ముందుగా నోటీసులు జారీ చేసి ఆ తర్వాత సంబంధిత ప్రాపర్టీదారులపై కోర్టులో కేసులు వేసేందుకు ప్రిపేర్​ అవుతున్నారు. బల్దియా ఉద్యోగుల వేతనాలు చెల్లించేందుకు ప్రాపర్టీ ట్యాక్స్​ కలెక్షన్ పైనే ఆధారపడాల్సి వస్తుండగా ట్యాక్స్ రాబట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.  

కలెక్షన్​ చేసుకురాకుంటే సిబ్బందికి మెమోలు 
ఎలాగైనా ప్రాపర్టీ ట్యాక్స్​కలెక్షన్ చేసుకురావాలని కిందిస్థాయి సిబ్బందిపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పన్ను వసూలు చేయకపోతే చర్యలుంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే సర్కిల్​15, 16 లో పలువురు ఉద్యోగులకు మెమోలు కూడా జారీ చేశారు. ప్రజలు పన్నులు చెల్లించకపోతే తాము ఏం చేస్తామని కొందరు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తారీఖు వస్తుండడంతో ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి బల్దియాకు ఏర్పడింది. పన్నులు వసూలు చేయాలని బిల్ కలెక్టర్లతో పాటు ఆఫీసర్లపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రాపర్టీ చెల్లించని వారి ఆస్తులను సీజ్ చేస్తున్నారు. కొద్ది రోజులు టైమ్ ఇవ్వాలని వేడుకుంటున్న కూడా వదలడంలేదు. గ్రేటర్ పరిధిలో ఇప్పటికే దాదాపు 500 లకుపైగా ప్రాపర్టీలను సీజ్ చేశారు.