ఆస్తి పన్ను వసూళ్లలో గోల్ మాల్! కమర్షియల్ బిల్డింగులకు డొమెస్టిక్ ట్యాక్స్ .. GHMC అధికారుల చేతివాటం

ఆస్తి పన్ను వసూళ్లలో గోల్ మాల్! కమర్షియల్ బిల్డింగులకు డొమెస్టిక్ ట్యాక్స్ .. GHMC అధికారుల చేతివాటం
  • ప్రాపర్టీ టాక్స్​ నిర్ధారణ, కొలతల్లో బల్దియా అధికారుల చేతివాటం 
  • వాణిజ్య విద్యుత్​ కనెక్షన్లకు.. ట్రేడ్​ లైసెన్సులకు మధ్య భారీ వ్యత్యాసం 
  • వేల కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్న మున్సిపల్ శాఖ
  • అక్రమాల లెక్క తేల్చేందుకు ఏసీబీని రంగంలోకి దింపిన ప్రభుత్వం  

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రాపర్టీ ట్యాక్స్​ వసూళ్లలో భారీ గోల్​మాల్ ​జరుగుతోంది. మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేస్తున్న అక్రమాల వల్ల  ప్రభుత్వాదాయానికి  వేల కోట్లలో గండి పడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కేటగిరీ టు, త్రీ, ఫోర్ విద్యుత్ కనెక్షన్లు 20 లక్షలుండగా.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స్​లు మాత్రం 2 లక్షలలోపే ఉన్నాయి. 

దీన్నిబట్టి కమర్షియల్, ఇండస్ట్రియల్​బిల్డింగులకు కూడా డొమెస్టిక్ ప్రాపర్టీ ట్యాక్స్ ​ఫిక్స్ ​చేసినట్టు, చాలా చోట్ల వ్యాపార, వాణిజ్య భవనాలకు సంబంధించిన  కొలతల్లోనూ అక్రమాలు జరిగినట్టు స్పష్టమవుతోంది. కమర్షియల్ విద్యుత్​ కనెక్షన్లు, కమర్షియల్ ​బిల్డింగుల సంఖ్యలో భారీగా తేడాలు ఉండడం, బల్దియాల నుంచి ఆశించిన స్థాయిలో ఆస్తి పన్నులు రాకపోవడంతో అక్రమాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఏసీబీని రంగంలోకి దింపింది. 

జగిత్యాల, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఇప్పటికే  ఏసీబీ దాడులు చేసి అక్రమాలను నిగ్గు తేల్చారు. కరెంట్​ కనెక్షన్లు 20 లక్షలు.. ట్రేడ్​ లైసెన్స్​లు 2 లక్షలు కేటగిరీ 1 కింద ఇండ్లకు కరెంట్​ కనెక్షన్లు  ఇచ్చే డిస్కమ్​లు వ్యాపార, వాణిజ్య అవసరాలకు కేటగిరీ 2, 3,4 కింద కనెక్షన్లు ఇస్తాయి. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో 20 లక్షలకు పైగా కమర్శియల్​కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. కానీ, రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రెడ్​లైసెన్స్ ల సంఖ్య 2 లక్షలు దాటలేదు. 

చాలామంది లైసెన్సులు తీసుకోకుండానే వ్యాపారాలు చేస్తున్నారని, దీంతో పాటు కమర్షియల్​బిల్డింగులకు ప్రాపర్టీ ట్యాక్స్​ విధించడంలో బల్దియా అధికారులు,  సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో 121 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లున్నాయి. ఈ బల్దియాల్లో   దాదాపు 15, 16 లక్షల భవనాలకు ట్యాక్స్​ఖరారులో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో రెసిడెన్షియల్, కమర్షియల్,  ఇండస్ట్రియల్ వినియోగం ఆధారంగా భవనాలకు ఆస్తి పన్నులు ఖరారు చేస్తారు. ఒక్కో కేటగిరీ కింద ట్యాక్స్​ఒక్కో విధంగా ఉంటుంది. 

నివాస గృహాలకు ప్రాపర్టీ ట్యాక్స్​ తక్కువగా ఉంటుంది. కొందరు కమర్షియల్ భవన యజమానులతో అధికారులు, సిబ్బంది కుమ్మక్కయి డొమెస్టిక్​ రేట్లనే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 2025–26లో రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్​కింద రూ. 3,186 కోట్టు మాత్రమే వసూలయ్యాయి. ఇందులో  గ్రేటర్​ హైదరాబాద్​లోని మూడు కార్పొర్పొరేషన్లలో రూ.2,501 కోట్లు వసూలు కాగా, ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి  రూ.685 కోట్లు మాత్రమే వచ్చాయి. కరెంట్​కనెక్షన్లు, ట్రెడ్​ లైసెన్స్​ ల మధ్య తేడాను బట్టి  ఏటా వేల కోట్లలో ఆదాయాన్ని నష్టపోతున్నట్టు మున్సిపల్​ శాఖ ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. 

గ్రేటర్​లో భారీ మోసం

గ్రేటర్​ హైదరాబాద్​లో భారీ మోసాలు జరుగుతున్నట్టు అనుమానిస్తున్నారు. ఇక్కడ 63.51 లక్షల రెసిడెన్షియల్, 9 లక్షల నాన్ రెసిడెన్షియల్ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. హై రైజ్​ బిల్డింగ్​లు,  పెద్ద షాపింగ్​ మాల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, హోటల్స్​ఎక్కువగా ఉన్నాయి. కానీ, 1.15 లక్షల ట్రేడ్​ లైసెన్స్​లు మాత్రమే తీసుకున్నారు. గ్రేటర్​లో 2024–25లో ప్రాపర్టీ ట్యాక్స్ కింద కేవలం రూ.2,501 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. సరైన పద్ధతిలో ప్రాపర్టీ ట్యాక్స్​ విధిస్తే ఒక్క ఏడాదిలోనే రూ.5 వేల కోట్లకు పైగా వసూలవుతుందని అంచనా వేస్తున్నారు. దీనికి తోడు సిబ్బంది భవన కొలతల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు విమర్శలున్నాయి. ఒక ఇంట్లో కొంత భాగం రెసిడెన్షియల్ అవసరాలకు.. ఇంకా కొంత భాగం కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తుంటారు. వినియోగాన్ని బట్టి వేర్వేరుగా కొలతలు వేసి ట్యాక్స్​నిర్ధారించాలి. కానీ, సిబ్బంది కమర్శియల్​వినియోగానికి సంబంధించి కొలతల్లోనూ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. 

మొత్తం బిల్డింగ్​ను రెసిడెన్షియల్​ కింద చూపించడం వల్ల ఇటు ట్రేడ్​ లైసెన్స్ ఫీజు, అటు ఆస్తి పన్ను డబ్బులు రూ.వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరట్లేదు. దీంతో సిబ్బంది చేతివాటంపై ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఖజానాకు  రూ.వేల కోట్ల నష్టం వస్తుందని తెలియడంతో సర్కారు ఏసీబీ ఆఫీసర్లను రంగంలోకి దించింది. ఇటీవల జగిత్యాల, మిర్యాలగూడ మున్సిపాలిటీల్లో ఏసీబీ ఆఫీసర్లు ఆకస్మిక దాడులు చేయగా, ఆస్తి పన్నుల వసూళ్లలో జరిగిన అక్రమాలు వెలుగుచూశాయి. మున్సిపల్ అధికారులు, సిబ్బంది యూపీఐ లావాదేవీలపై కూడా ఏసీబీ అధికారులు పక్కా సమాచారం సేకరించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి త్వరలోనే అందజేయనున్నట్టు సమాచారం.

  • కరెంట్​ కనెక్షన్లు 20 లక్షలు.. ట్రేడ్​ లైసెన్స్​లు 2 లక్షలు 

కేటగిరీ 1 కింద ఇండ్లకు కరెంట్​ కనెక్షన్లు  ఇచ్చే డిస్కమ్​లు వ్యాపార, వాణిజ్య అవసరాలకు కేటగిరీ 2, 3,4 కింద కనెక్షన్లు ఇస్తాయి. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో 20 లక్షలకు పైగా కమర్షియల్​ కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి.