కొత్తవి కడ్తలేరు.. పాతవి కూల్చుతున్రు

కొత్తవి కడ్తలేరు.. పాతవి కూల్చుతున్రు
  • కొమురవెల్లిలోడొనర్స్ ​గదులకు ఎసరు
  • 21 గదుల కూల్చివేతకు ప్రతిపాదనలు
  • మూడేండ్ల కింద ప్రారంభమైన 50 గదుల పనులు ఇప్పటికీ పూర్తి కాలే

సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న భక్తుల వసతి కోసం కొత్త భవనాలు కట్టడం పక్కన పెట్టి  పాతవి కూల్చడానికి అధికారులు సిద్ధపడుతున్నారు.  వేల సంఖ్య లో వచ్చే భక్తులకు సరిపోక  ప్రైవేటు గదుల్లో ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో 30 ఏండ్ల కింద  దాతల సహకారంతో నిర్మించిన 21 గదులను కూల్చి  అక్కడ  కొత్త గదులు నిర్మిస్తామని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే గదుల కూల్చివేతతో భక్తులకు మరిన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. 

ఏండ్ల కొద్దీ ఈ గదులే దిక్కు.. 

 కొమురవెల్లిలో భక్తులకు దాదాపు 30 ఏండ్ల కింద దాతల సహకారంతో  నిర్మించిన 120 గదులే దిక్కవుతున్నాయి. ఇవి దొరకకపోతే వేల రూపాయలతో ప్రైవేటు గదులను అద్దెకు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దాతల సహకారంతో నిర్మించిన మొత్తం 120 గదుల్లో  10 గదులు దేవస్థాన పాలనా వ్యవహారాల కోసం , 20 గదులు దేవస్థానం నిర్వహించే  వేదపాఠశాల,  ప్రసాదశాలతో పాటు  ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు.  30  గదుల్లో సౌకర్యాలు లేక తాళాలు వేశారు.  ప్రస్తుతం 60 గదులు మాత్రమే భక్తులకు అందుబాటులో ఉండగా వాటిలో బాదంచెట్లు ప్రాంతంలో ఉన్న 21 గదులను కూల్చి వేయాలని అధికారులు నిర్ణయించారు.  ఇంతకుముందు కూడా  కొత్తగా నిర్మించిన ధర్మశాలలు అందుబాటులోకి రాకముందే భక్తులకు వివిధ ప్రాంతాల్లో  వసతిని కల్పించే  గదులను వివిధ కారణాలతో కూల్చారు. క్యూకాంప్లెక్స్ నిర్మాణం కోసం రాజగోపురం పక్కన  దాత శంకర్ యాదవ్ నిర్మించిన సుమారు 10 గదులను ,  దేవస్థానం వెనుక మెట్ల  వైపు  పాత బుకింగ్ కార్యాలయం గదులను కూల్చివేశారు. 

మూడేండ్లుగా పూర్తికాని కొత్త గదుల పనులు

మల్లన్న ఆలయం సమీపంలోని బండగుట్టపైన 50 గదుల ధర్మశాల నిర్మాణ పనులు ప్రారంభమై మూడేండ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. డార్మిటరీ తో పాటు రెండతస్తుల్లో 50 గదుల ధర్మశాల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 70 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. 21 గదులను కూల్చి ఆ స్థానంలో రూ.12 కోట్లతో  మూడు అంతస్తుల్లో 63 గదులను నిర్మించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

శాంక్షన్  కాగానే పనుల ప్రారంభిస్తాం 

కొమురవెల్లిలో దాతల సహకారంతో నిర్మించిన 21గదులను కూల్చి కొత్త గా మూడంతస్తుల్లో  63 గదులతో కాంప్లెక్స్ ను కట్టాలని నిర్ణయించి  ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. ప్రభుత్వం నుంచి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్  రాగానే 63 గదుల నిర్మాణ  పనులను ప్రారంభిస్తాం. బండ గుట్ట పైన  నిర్మిస్తున్న  50 గదుల ధర్మశాలను మరో మూడు నెలల్లో పూర్తి చేసి భక్తులకు అందుబాటులో తేవడానికి కృషి చేస్తున్నాం. 

 బాలాజీ, ఈవొ కొమురవెల్లి దేవస్థానం