
- సర్కార్, డిస్కంల తప్పిదాలకు జనంపై భారం
- ఇప్పటికే రూ.4,092 కోట్ల వసూళ్లకు అనుమతి
- కరెంటు కొనుగోళ్ల నష్టాలు రూ.33, 212 కోట్లు
- డిస్కంలకు ప్రభుత్వ సంస్థల బాకీ రూ.20,841.03కోట్లు
- జనవరి 18న ట్రూఅప్ చార్జీలపై ఈఆర్‌సీ విచారణ
హైదరాబాద్, వెలుగు: కరెంటు చార్జీలు పెంచబోమని చెప్తూనే ప్రజలపై దొడ్డిదారిన రూ.12వేల కోట్లకు పైగా భారం మోపేందుకు రాష్ట్ర సర్కార్ రెడీ అయింది. కరెంటు సరఫరా నష్టాలను భరించకుండా ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ట్రూ అప్ చార్జీలు పేరుతో బాదుడుకు తెరలేపింది. ఏప్రిల్ నుంచి యూనిట్‌కు 50 పైసల నుంచి రూ.1 వరకుపెంచిన చార్జీలను మరచిపోకముందే మరోసారి వసూళ్లకు రంగం సిద్ధం చేసింది. ఇదేదో ఒక నెల రెండు నెలలతో పోయే వ్యవహారం కాకుండా ఏండ్ల తరబడి ప్రతి నెల వసూలు చేయనుండడం మరింత భారంగా మారనుంది. విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) అనుమతి తర్వాత కరెంటు వినియోగదారుల పరిధిని బట్టి ఈ చార్జీలు భరించాల్సి ఉంటుంది.
2016–17 నుంచి 2022–23 వరకు ట్రూఅప్ చార్జీలు రూ.12,015.46కోట్లు పెంచాలని విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కంలు తాజాగా ప్రతిపాదనలు పంపించాయి. మా అంచనాలు తప్పాయి.. ఇప్పుడు వసూలు చేసుకోవడానికి అనుతించాలని ఈఆర్‌సీనీ కోరాయి. ఈ ప్రతిపాదనలపై జనవరి 18న ఈఆర్‌సీ బహిరంగ విచారణ జరిపి నిర్ణయం తీస్కోవాల్సి ఉంది. ఇప్పటికే గత 2006–07 నుంచి 15ఏళ్ల క్రితం నాటి డిస్ట్రిబ్యూషన్ నష్టాలను సర్దుబాటు చార్జీలు రూ.4,092 కోట్లు వసూళ్లకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 30పైసలు పెంచుకోవడానికి ఈఆర్‌సీ అనుమతించింది. వాటికి ఈ తాజా ట్రూఅప్ చార్జీలు తోడయితే 1.71కోట్ల విద్యుత్ వినియోగదారులపై భారీగా భారం పడనుంది. ప్రతిపాదిత రూ.12,015కోట్లలో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సదరన్ డిస్కం రూ.9060.80కోట్లు, వరంగల్ కేంద్రంగా నార్తర్న్ డిస్కం నుంచి రూ.2954.66కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు ఈఆర్‌సీకి నివేదించాయి.
ఐదేండ్ల కరెంటు కొనుగోళ్ల నష్టాలు రూ.33,212కోట్లు
ఐదేండ్లలో యూనిట్ కరెంటు కోసం రూ.10 నుంచి రూ.20 వరకు అడ్డగోలుగా ఖర్చు చేసి డిస్కంలు కొనుగోళ్లు చేశాయి. సగటున యూనిట్‌కు రూ.9.65పైసల వరకు ఖర్చు అయింది. సర్కారు పరువు కాపాడేందుకు వేలకోట్లు ఖర్చు చేసి అత్యధిక ధరకు కరెంటు కొన్నాయి. సబ్సిడీ పథకాల కోసం సరఫరా చేసిన కరెంటుకు సర్కారు ఇచ్చిన పైసలు సరిపోక డిస్కంలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. 15ఏండ్లలో రూ.33,212కోట్లు నష్టపోయినట్లు ఈఆర్‌సీకి ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నాయి. ఇందులో 2016–17 నుంచి 2022–23 వరకు కేవలం నాలుగేండ్లలోనే రూ.29212 కోట్లు నష్టపోయినట్టు వివరించాయి. 201617 నుంచి 2019–20 వరకు నష్టాల్లో రాష్ట్ర సర్కారు రూ.7,961 ఈక్విటీ రూపంలో చెల్లించిందని తెలిపాయి. అదే విధంగా ఉదయ్ స్కీమ్‌లో భాగంగా నష్టాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం రూ. 9,236 కోట్లను ఈక్విటీ రూపంలో చెల్లించిందని డిస్కంలు పేర్కొన్నాయి. ఇలా రూ.17197కోట్లు భరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు రిపోర్టులో స్పష్టం చేశాయి. ఇవిపోగా మరో 16,015 కోట్లు నష్టాలున్నట్లు స్పష్టం చేసింది. ఇందులో 2006–07 నుంచి నేటి వరకు జరిగిన డిస్ట్రిబ్యూషన్ నష్టాలు రూ.4వేల కోట్లను సర్దుబాటు చేసుకోవడానికి యూనిట్‌కు 30పైసల చొప్పున చార్జీలు పెంచుకోవడానికి డిస్కంలకు ఈఆర్‌సీ ఇప్పటికే పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక మిగిలిన రూ.12015కోట్లు పవర్ పర్చేజ్ ట్రూఅప్ చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని డిస్కంలు తమ ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ఇవి కాకుండా మరో రూ.500కోట్ల వరకు జెన్‌కో, సింగరేణిలో కూడా ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి వసూళ్లకు పిటిషన్లు దాఖలు చేశాయి.
కరెంటు కొనుగోళ్లలో భారీ నష్టం
డిస్కంల లెక్కల ప్రకారం 2016–17 నుంచి 2022–23 వరకు కరెంటు కోనుగోలు ఖర్చు రూ.1లక్షా 87వేల 656 కోట్లు. అయితే రెగ్యులేషన్ రూల్స్ప్రకారం చార్జీల రూపంలో 1లక్షల 43వేల 903కోట్లు మాత్రమే ఆదాయం వచ్చాయి. ఫలితంగా భారీగా నష్టపోయామని డిస్కంలు తమ ట్రూఅప్ పిటిషన్‌లో పేర్కొన్నాయి.
అప్పుడు చెల్లించినా.. మళ్లీ భరించాల్సిందేనా?
2016–17 నుంచి నేటి వరకు ఆయా వినియోగదారులు వాడిన యూనిట్లను బట్టి ఈ ట్రూ అప్ చార్జీలు భరించాల్సి ఉంటుంది. ఐదేండ్లలో మొత్తం ఎన్ని యూనిట్లు వాడారనేది లెక్కగట్టి దాన్ని ఎన్ని నెలల బిల్లుల్లో సర్దుబాటు చేయాలో నిర్ణయించి వసూలు చేస్తారు. అప్పుడు కరెంటు చార్జీలు చెల్లించినా డిస్కంలకు నష్టాలు వచ్చాయని చెప్పి మళ్లీ ఇప్పుడు ఆ భారం భరించాల్సిన పరిస్థితి. ఎవరో, ఎప్పుడో వాడిన కరెంటు కోసం ఇప్పుడు మేం ఎందుకు బిల్లులు కట్టాలని కిరాయిదారుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. నిజానికి డిస్కమ్‌లకు నష్టాలు రావడానికి అనేక కారణాలున్నాయి. విద్యుత్ లైన్లలో లోపాలు, కరెంట్ కొనుగోళ్లలో అవకతవకలే నష్టాలకు ప్రధాన కారణం. డిస్కంల తప్పిదాలతో వచ్చిన నష్టాలు జనాలు భరించాల్సి వస్తోంది. నష్టాలకు కారణమవుతున్న డిస్కమ్ లను సరి చేయాల్సింది ఈఆర్‌సీ ప్రజలపై భారం మోపేందుకు అవకాశం ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు.
ప్రభుత్వ బకాయిలు రూ.20,841.03కోట్లు
డిస్కంలకు ప్రభుత్వ సంస్థల బకాయిలు రాష్టం వచ్చే నాటికి రూ.1,302 కోట్లు మాత్రమే ఉండగా ఇప్పుడు అవి రూ.20,841.03 కోట్లకు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ కు రూ.11,950.66 కోట్లు బాకీ పడగా, వరంగల్ కేంద్రంగా ఉన్న టీఎస్‌ఎన్‌పీ డీసీఎల్‌కు రూ.8890.37కోట్లు బాకీ ఉన్నట్లు పేర్కొంది. అంటే ఐదేండ్లలో రూ.20వేల కోట్లు బాకీ పడ్డాయి. దీంతో ఆయా కంపెనీలు నష్టాల్లో మునిగిపోయాయి. వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం వినియోగదారులపై కరెంటు చార్జీల భారం మోపుతోంది.
ట్రూఅప్ చార్జీలపై జనవరి 18న నిర్ణయం
డిస్కంలు శనివారం ట్రూ అప్ చార్జీల పిటిషన్ ఇచ్చాయి. రెండు డిస్కంలు కలిపి రూ.12,015.46కోట్లకు గాను పిటిషన్‌ను దాఖలు చేశాయి. వివరాలను పబ్లిక్ డొమైన్‌లలో అందుబాటులో ఉంచుతాం. వీటిపై జనవరి 18న విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్రంలో విద్యుత్తు కనెక్షన్లు 1.71 కోట్లకు చేరు కున్నాయి. రాష్ట్రంలో 26.45లక్షలు అగ్రి కల్చర్ కనెక్షన్‌లు ఉండగా అనధికారికంగా మరో లక్ష విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి, అక్రమ కనెక్షన్‌ను డిస్కంలు రెగ్యులేట్ చేయాలి. అగ్రికల్చర్ ట్రాన్స్ ఫార్మర్ లకు మీటర్లు పెట్టి కరెంటు లెక్క తేల్చాలి. మార్చి 31 తరువాత క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. - ఈఆర్‌సీ చైర్మన్ శ్రీరంగరావు
ట్రూ అప్ చార్జీలంటే
డిస్కంల విద్యుత్ కొనుగోళ్లు, సరఫరాలో తేడాతో లావాదేవీల్లో వచ్చే నష్టాన్ని వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడమే ట్రూ అప్ చార్జీలు అంటారు. నష్టాల సర్దుబాటు పేరుతో గతంలోనూ ఇలాంటి వసూళ్లు జరిగాయి. డిస్కంలు తమ నష్టాలను తగ్గించుకునే పద్ధతులు పాటించకుండా ఇలా ప్రజల నుంచి బిల్లులు పెంచి వసూలు చేయడానికి ఈ విధానం తీసుకొచ్చారు. సర్దుబాటు రుసుములు, సర్ చార్జీలు, ట్రూ అప్ చార్జీలు ఇలా పేరు ఏదైనా భారం మాత్రం జనంపై మోపుతున్నారు.