
- ఆదివాసీల హక్కులు కాలరాస్తున్నరు: గడ్డం లక్ష్మణ్
- ట్యాంక్ బండ్పై అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన
ట్యాంక్ బండ్, వెలుగు: ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం చేస్తున్న ఎన్ కౌంటర్లు అన్నీ ప్రభుత్వ హత్యలే అని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్కు వ్యతిరేకంగా గురువారం ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ పౌర హక్కుల సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట వేదిక, ప్రజాసంఘాల నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం లక్ష్మణ్ మాట్లాడారు. ‘‘ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి.
ఆదివాసీల హక్కులను కాలరాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలి. నారాయణపూర్ లో జరిగింది ఫేక్ ఎన్కౌంటర్. అడవిలో ఉన్న సంపదను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ ప్రారంభించారు’’అని ఆయన ఆరోపించారు. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు కోరుతున్నా.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.