
హైదరాబాద్: ప్రజాకళాకారులపై ఉపా చట్టం కింద కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ 37 సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మహాగర్జన కార్యక్రమం విజయవంతమైంది. బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఙాన కేంద్రం వద్ద ప్రారంభమైన ప్రదర్శన వీఎస్టీ వరకు సాగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కళాకారులు, కవులు నినాదాలు చేశారు. కాలికి గజ్జెకట్టి ప్రభుత్వ.. కై గట్టి పాటపాడి ప్రభుత్వంపై గర్జించారు.
మలిదశ ఉద్యమంలో తెలంగాణకోసం ఆడిపాడిన తమపై ప్రభుత్వానికి ఎందుకంత అక్కసంటూ ఆక్రోశం వెల్లగక్కారు. సకల జనుల సమ్మెను ఉర్రూతలూగించిన తమపై ఏమిటీ కక్ష సాధింపు అంటూ మండిపడ్డారు. ప్రజా కవులు, కళాకారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉపా చట్టాన్నే ఎత్తివేయాలని పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు.