కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని రెగ్యులరైజ్ చేయండి

కాంట్రాక్ట్ ఫ్యాకల్టీని రెగ్యులరైజ్ చేయండి
  • మంత్రి సబిత ఇంటి ఎదుట కాంట్రాక్ట్ అసిస్టెంట్​ప్రొఫెసర్ల బైఠాయింపు
  • రెండు రోజుల్లో సీఎంకు రిపోర్టు ఇస్తానని మంత్రి హామీ

ఓయూ/ హైదరాబాద్, వెలుగు: తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు బైఠాయించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు శ్రీనగర్ కాలనీలోని మంత్రి సబితా ఇంటి వద్దకు వీరు చేరుకున్నారు. ఇంటి ఎదుట బైఠాయించిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల వద్దకు మంత్రి వచ్చి మాట్లాడారు. యూనివర్సిటీల కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడానికి సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్నారని తెలిపారు.

వచ్చే బుధవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని, ఈ సమావేశంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల రెగ్యులరైజేషన్ పై సీఎంకు రిపోర్ట్ అందజేస్తామని వివరించారు. కాగా కాంట్రాక్ట్  అసిస్టెంట్ ప్రొఫెసర్ నాయకులు మంత్రితో మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున తమ రెగ్యులరైజేషన్ ప్రాసెస్ ను తక్షణం చేపట్టాలని కోరారు. వారం రోజుల్లో తగిన ప్రకటన రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

మమ్మల్ని కొనసాగించండి: ఇంటర్​ గెస్ట్ లెక్చరర్లు

సర్కారు జూనియర్ కాలేజీల్లో తొమ్మిది, పదేండ్లుగా పనిచేస్తున్న తమకు.. ఈ ఏడాది కూడా రెన్యూవల్ చేయాలనీ గెస్ట్ లెక్చరర్లు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం మంత్రి సబితాఇంద్రారెడ్డిని సర్కారు జూనియర్ కాలేజీల గెస్ట్ లెక్చరర్ల యూనియన్ ప్రతినిధి బృందం కలిసింది. ఈ నెల 1న కాలేజీలు ప్రారంభమైనా, ఇప్పటికీ గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయలేదన్నారు. ఏండ్ల నుంచి సేవలందిస్తున్న గెస్టు లెక్చరర్ల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, జూన్ ఫస్ట్ నుంచే కొనసాగేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సానకూలంగా మంత్రి స్పందించారని, పాత గెస్ట్ లెక్చరర్లనే యథావిధిగా కొనసాగిస్తామని హామీనిచ్చినట్టు చెప్పారు.