
- బేకరీ పేరు మార్చాలంటూ శంషాబాద్‌లో నిరసన
- సిటీలో పాకిస్తాన్ఆనవాళ్లు ఉండొద్దంటూ నినాదాలు
- ‘కరాచీ’ పేరును కవర్లతో కప్పేసిన బేకరీ యాజమాన్యం
శంషాబాద్, వెలుగు: శంషాబాద్‌లోని కరాచీ బేకరీపై శనివారం స్థానికులు, బీజేపీ నాయకులు దాడి చేశారు. నేమ్‌బోర్డును ధ్వంసం చేశారు. వెంటనే బేకరీ పేరును మార్చాలని డిమాండ్‌చేశారు. సిటీలో పాకిస్తాన్ఆనవాళ్లు ఉండకూడదని, అక్కడి సిటీ పేరు అయిన కరాచీని తొలగించాలన్నారు. బార్డర్లో దేశం కోసం సైనికులు పోరాడుతుంటే శత్రుదేశానికి సంబంధించిన పేరును బేకరీకి ఎలా ఉంచుతారని ప్రశ్నించారు. పాకిస్తాన్ ముర్దాబాద్.. హిందుస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
బేకరీకి జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్టు పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. రేపటిలోగా బోర్డును తొలగింపజేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బేకరీ పేరు మార్చకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఆ తర్వాత బేకరీ యాజమాన్యం నేమ్‌బోర్డును నల్లటి కవర్లతో కప్పేశారు.