ఓవైపు ఫ్రాన్స్ తగలబడుతుంటే.. మరోవైపు ఐఫోన్లు, బైక్స్, కార్లు లూటీ

ఓవైపు ఫ్రాన్స్ తగలబడుతుంటే.. మరోవైపు  ఐఫోన్లు, బైక్స్, కార్లు లూటీ

ఓవైపు రోమ్ తగలబడుతుంటే.. మరోవైపు చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కుర్చున్నాడన్నది గతంలో ఉన్న సామెత. ఇప్పుడు ఫ్రాన్స్‌లో కొందరు దుండగుల వైఖరి అలాగే ఉంది. ఓవైపు నిరసనకారుల ఆందోళనలతో పారిస్‌తో పాటు మరికొన్ని నగరాలు అగ్నికి ఆహుతవుతుంటే.. సందట్లో సడేమియా అన్నట్లు కొంత మంది కుర్రోళ్లు.. షాపులు, మాల్స్ లూటీ చేస్తున్నారు. ఐ ఫోన్లు, బైకులు, కార్ల షోరూమ్స్ టార్గెట్‌గా పెట్టుకుని మరీ.. ఆయా మాల్స్, షాపులను లూటీ చేస్తున్నారు. 

వందల సంఖ్యలో యువకులు గుంపుగా చేరి.. ఆయా మాల్స్, షాపుల దగ్గర బీభత్సం చేయటం.. వాహనాలు తగలబెడుతూ అక్కడున్న వారిని భయాందోళనలకు గురి చేయటం.. ఆ వెంటనే షాపుల్లోకి చొరబడి అందిన కాడికి ఎత్తుకెళ్లటం గత మూడు రోజులుగా కామన్ అయిపోయింది. పారిస్ నగర శివార్లలోని ఓ సెల్ ఫోన్ షాపుపై పదుల సంఖ్యలో యువకులు ఒక్కసారిగా దాడి చేసి.. ఆ షాపులోని వందల సంఖ్యలో ఐఫోన్లతోపాటు చేతికి దొరికిన ఫోన్లు అన్నింటినీ ఎత్తుకెళ్లిపోయారు.

మరో చోట ఓ బైక్ షోరూంపై దాడి చేసి.. లక్షల విలువైన లగ్జరీ, స్పోర్ట్స్ బైకులను దర్జాగా వేసుకుపోయారు. చేస్తుంది దోపిడీలు అయినా.. ఎంతో ముచ్చటగా.. వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టటం గమనార్హం. అదే విధంగా ఓ కార్ల షోరూంపై దాడి చేసి.. కార్లు దోపిడీ చేసినల్టు తెలుస్తోంది.

France looks like The Purge. pic.twitter.com/BtZdRbcdU4

— Ian Miles Cheong (@stillgray) July 1, 2023

Pillage d'un magasin de motos à Lyon #emeutes #Nanteree pic.twitter.com/WOB2kWs2Cn

— Anonyme Citoyen (@AnonymeCitoyen) June 30, 2023

17 ఏళ్ల నహేల్‌ అనే యువకుడిని పోలీసులు కాల్చిచంపడమే ఈ ఆందోళనలకు మూల కారణం. ఈ అశాంతి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. అందునా ఆందోళనల్లో పాల్గొంటున్న వారిలో యువతే ఎక్కువగా ఉండడం ఫ్రెంచ్‌ పాలకులను కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో టీనేజర్లను ఇంట్లోనే ఉంచాలని తల్లిదండ్రులను ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ కోరారు.