కాళేశ్వరంపై మహరాష్ట్రలో రెండో రోజు కొనసాగిన నిరసనలు

కాళేశ్వరంపై మహరాష్ట్రలో రెండో రోజు కొనసాగిన నిరసనలు
  • గడ్చిరోలి జిల్లా సిరోంచలో రెండో రోజు కొనసాగిన ర్యాలీలు.. రిలే నిరాహర దీక్షలు

కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహరాష్ట్ర గడ్చిరౌలి జిల్లా సిరోంచలో 30 గ్రామాల రైతులు చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. ఇవాళ రెండో రోజు రిలే దీక్షలకు ముందు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా  మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్తో తమ పంట భూములు నీట మునిగి నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తూ సిరోంచ వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. సీఎం కేసిఆర్ డౌన్ డౌన్, ముర్దాబాద్ అంటు నినాదాలు చేశారు.

అనంతరం సిరోంచ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహర దీక్షా శిబిరానికి చేరుకున్నారు. తహసీల్దార్ ఆఫీసు ఎదుట టెంట్ వేసుకుని బైఠాయించి రెండో రోజు రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలోని సిరోంచ తాలుకా పరిధిలో ఉన్న వెయ్యి ఎకరాల పంటలు నీట మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాలు మాత్రమే సేకరించినా..మరో 600 ఎకరాలు నీట మునుగుతున్నా పరిహారం విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే భూ సర్వే చేపట్టి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.