బండి భగీరథ్ను అరెస్ట్ చేయాల్సిందే... సిటీ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

బండి భగీరథ్ను అరెస్ట్ చేయాల్సిందే... సిటీ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

ట్యాంక్ బండ్/ఉప్పల్/అంబర్​పేట్​/నారాయణగూడ, వెలుగు: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన బండి సాయి భగీరథ్​ను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సీపీఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ.. పోక్సో కేసు నమోదై 36 గంటలు గడుస్తున్నా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. 

గతంలోనూ భగీరథ్ అనేక కేసుల్లో ఇరుక్కున్నాడని, 24 గంటల్లో అరెస్ట్ చేయకపోతే డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతుగా నిలవడం సిగ్గుచేటని అంబర్​పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు మల్లికార్జున్ యాదవ్ ఆధ్వర్యంలో అంబర్​పేట్ చే నంబర్ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘బేటీ బచావో’ అని చెప్పే ప్రధాని మోదీ, తన మంత్రి కొడుకుపై చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. హైదర్​గూడలోని ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన సమావేశంలో పీఓడబ్ల్యూ జాతీయ కన్వీనర్ వి.సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు జి. అనసూయ మాట్లాడారు. 17 ఏండ్ల మైనర్ బాలికపై రివర్స్​లో హనీట్రాప్ కేసు పెట్టడం చట్టవిరుద్ధమని, ఇది నిందితుడిని కాపాడటమేనని ఆరోపించారు. 

ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించి బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉప్పల్ చౌరస్తాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను 
దహనం చేశారు. 

బాలల హక్కుల కమిషన్​కు ఫిర్యాదు

జూబ్లీహిల్స్, వెలుగు: భగీరథపై నమోదైన పోక్సో కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ మహిళా నేతలు తెలంగాణ బాలల హక్కుల కమిషన్ చైర్​పర్సన్​కు వినతిపత్రం సమర్పించారు. మాజీ జడ్పీటీసీ చైర్మన్లు తుల ఉమ, చారులత, మాగంటి సునీత తదితరులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలు ఉన్నా ఇప్పటివరకు నిందితుడిని అరెస్ట్ చేయకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నిజాయితీ గల నాయకుడైతే తన కుమారుడిని పోలీసులకు అప్పగించాలన్నారు.