రాజ్యాంగ పునాదులను పెకిలించడమేనంటూ ప్రతిపక్షాల ఫైర్
ఇస్లామాబాద్: ఆర్మీ చీఫ్‌కు విస్తృత అధికారాలు, జీవితకాల రక్షణ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుపై పాకిస్తాన్‌లో దేశవ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. ప్రభుత్వ నిర్ణయంతో రాజ్యాంగ పునాదులు ధ్వంసం అయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశాయి. సర్కారు ప్రవేశపెట్టిన 27వ రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆదివారం నుంచి దేశవ్యాప్త ఆందోళనలు ప్రకటించాయి. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్, పశ్తున్ఖ్వా మిలీ అవామీ పార్టీ, బలూచిస్తాన్ నేషనల్ పార్టీ మెంగల్‌తో పాటు మరో 3 ప్రతిపక్షపార్టీలు నిరసనలు చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య సంస్థలు నోరు మెదపట్లేదని, సవరణకు వ్యతిరేకంగా పౌరులే పోరాడాలని సూచించాయి.
సవరణ బిల్లుపై నేడు సెనేట్‌లో ఓటింగ్..
త్రివిధ దళాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్) అనే కొత్త పదవిని సృష్టించాలని పాకిస్తాన్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు ఆ దేశ రాజ్యాంగంలోని ఆర్టికల్ 243ను సవరించాల్సి ఉంది. ఇందులో భాగంగా షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 27వ రాజ్యాంగ సవరణ బిల్లును శనివారం సెనేట్‌లో ప్రవేశపెట్టింది.
ఈ బిల్లుపై సోమవారం ఓటింగ్ జరగనుంది. ఈ సవరణతో జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ పదవి రద్దయి.. త్రివిధ దళాలకు అధిపతిగా ఉండే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ పోస్ట్ ఏర్పడనుంది. చట్ట సవరణ తర్వాత ఫీల్డ్ మార్షల్ స్థాయి అధికారిని సీడీఎఫ్‌గా నియమిస్తారు. చట్ట సవరణ తర్వాత ప్రస్తుత ఫీల్డ్ మార్షల్, ఆర్మీ చీఫ్‌గా ఉన్న ఆసిమ్ మునీర్‌కే సీడీఎఫ్ పదవి దక్కే అవకాశం ఉంది.
