మాకిచ్చే పైసలు లీడర్లు, ఆఫీసర్లు కాజేస్తున్నరు

మాకిచ్చే పైసలు లీడర్లు, ఆఫీసర్లు కాజేస్తున్నరు
  • లీడర్లు, ఆఫీసర్లు మిలాఖత్​ అయిన్రు: హైదరాబాద్​లో వరద బాధితుల ఆగ్రహం
  •     ఎల్బీనగర్, దోమలగూడ, మల్కాజ్​గిరి ఏరియాల్లో భారీ ధర్నాలు
  •     ఎక్కడికక్కడ నిలదీతలు.. బాధితులకు కాంగ్రెస్​, బీజేపీ మద్దతు
  •      సాయం కోసం రెండు లక్షల మంది ఎదురుచూపులు
  •     టీఆర్​ఎస్​ లీడర్లపై క్రిమినల్​ కేసులు పెట్టాలి: ఎంపీ రేవంత్​ రెడ్డి
  •     వరద సాయం పంపిణీలో భారీ స్కాం: పీసీసీ చీఫ్​ ఉత్తమ్​
  •      గవర్నర్​కు ఫోన్​లో ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు:వరద సాయం పంపిణీ తీరుపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. లోకల్​ టీఆర్​ఎస్​ లీడర్లు, ఆఫీసర్లు కుమ్మక్కై డబ్బులను కాజేస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. తమకు ఇప్పటివరకు సాయమే అందలేదని కొన్నిచోట్ల.. రూ. పదివేల సాయం అని చెప్పి 2 వేలే ఇస్తున్నారని మరికొన్ని చోట్ల.. ఇట్ల హైదరాబాద్​లో శుక్రవారం చాలా ప్రాంతాల్లో బాధితులు ధర్నాలకు దిగారు. ఎక్కడికక్కడ టీఆర్​ఎస్​ లీడర్లను, ఆఫీసర్లను నిలదీశారు. బాధితులకు కాంగ్రెస్​, బీజేపీ నేతలు మద్దతు పలికారు.

సాయం కోసం పైరవీలు చేయాల్నా?

వరదలతో ఇంట్లో వస్తువులన్నీ పాడైపోయాయని, సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. కొందరికి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం కోసం పైరవీలు చేయాల్నా అంటూ కవాడీ గూడ డివిజన్​లోని దోమలగూడ చౌరస్తాలో  రోడ్డుపై బైఠాయించారు. ధోబీ గల్లి, ఈశ్వరమ్మ బండ, సూరజ్ నగర్, బ్యాంక్ కాలనీ, వినాయక్ నగర్​ ప్రాంతాల నుంచి తరలివచ్చి నిరసనకు దిగారు. మల్కాజ్​గిరి సర్కిల్​ఆఫీస్​ను ఓల్డ్ నేరేడ్​మెట్​లోని బాధితులు ముట్టడించారు.  రూ.10 వేలు ఎప్పుడిస్తారని కార్పొరేటర్​ను నిలదీశారు.  జీహెచ్ఎంసీ ఆఫీస్​ను రాజేంద్రనగర్  ప్రజలు ముట్టడించారు. తమకు అనుకూలమైనవారికే  టీఆర్​ఎస్​ లీడర్లు వరద సాయం పంపిణీ చేస్తున్నారని, అసలైన బాధితులను పట్టించుకోవడం లేదని సులేమాన్ నగర్ డివిజన్, హసన్ నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు ఆరోపించారు.  వరదలు ముంచెత్తి మూడువారాలవుతున్నా ఇంతవరకు తమకు సాయం అందలేదని చెప్పారు.

తలసాని ముందు బాధితుల గోస

హైదరాబాద్​లోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం వరద సాయం పంపిణీ చేశారు. లోకల్​ లీడర్లు కుమ్మక్కై వరద సాయాన్ని కాజేస్తున్నారని మంత్రికి అంబర్ పేట్, ముషీరాబాద్, గోషా మహల్ నియోజకవర్గాల పరిధిలోని బాధితులు చెప్పారు. అందరికీ సాయం అందుతుందని ఆయన హామీ ఇచ్చారు.  బాగ్ అంబర్ పేట్ లో సాయం పంపిణీ చేసి మంత్రి వెళ్లిన తర్వాత..  కార్పొరేటర్​ను స్థానికులు నిలదీశారు. తమకెందుకు సాయం ఇవ్వరంటూ అద్దెకున్నోళ్లు ఆందోళనకు దిగితే.. తమను కాదని అద్దెకున్నోళ్లకు ఎట్ల ఇస్తారని ఓనర్లు ప్రశ్నించారు. అందరికీ సాయం చేయాల్సిందేనని పట్టుబట్టారు.

టీఆర్​ఎస్​ లీడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలి: రేవంత్​

మల్కాజ్​గిరి నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్​ ఎదుట వరద బాధితులతో కలిసి ఎంపీ రేవంత్ రెడ్డి ఆందోళనకు దిగారు. అసలైన బాధితులకు సోమవారం లోగా పంపిణీ చేయకపోవతే ఆరు డివిజన్ల పరిధిలోని  ఆరువేల మంది బస్తీవాసులతో జోనల్ ఆఫీస్​ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కమీషన్ రూపంలో సాయం నొక్కేసిన టీఆర్ఎస్ లీడర్లపై చర్యలు తీసుకోవాలని,  క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

బాధితుల సొమ్ము కాజేస్తున్నరు: బీజేపీ

వరద బాధితులకు మద్దతుగా ఎల్బీ నగర్ జోనల్  ఆఫీస్​ను మహేశ్వరం, ఎల్బీనగర్  బీజేపీ నేతలు ముట్టడించారు. బాధితులతో కలిసి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. బాధితులకు అందాల్సిన డబ్బును ఆఫీసర్లు, టీఆర్​ఎస్​ లీడర్లు కలిసి కాజేస్తున్నారని వారు ఆరోపించారు. బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.

రెండు లక్షల మంది ఎదురుచూపులు

హైదరాబాద్​లో వరద సాయంగా 5.5 లక్షల మందికి అందించేందుకు రూ. 550 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు 4 లక్షల మందికే పరిహారం అందినట్లు తెలుస్తోంది. మరో లక్ష కుటుంబాలకు ఇంకా అందాల్సి ఉంది. వారితోపాటు మరో లక్ష మందికిపైగా బాధితులు ఉంటారని ప్రతిపక్షాలు అంటున్నాయి. బాధితులందరికీ సాయం చేయాల్సిందేనని, అక్రమాలకు పాల్పడ్డవారిపై కేసులు నమోదు చేయాల్సిందేనని డిమాండ్​ చేస్తున్నాయి.

ఒక్క పైసా ఇయ్యలె

మా ఇంట్లోకి వెనక గల్లి నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. వారం రోజులు కష్టపడి నీరు ఎత్తిపోసినం. అప్పుడు ఆఫీసర్లు వచ్చి చూసిపోయిన్రు. కానీ ఒక్క పైసా సాయం చేయలె.  అడిగితే రోజుకో మాట చెప్తున్నరు. ఆఫీసులకు వెళ్లి అడిగితే కోపంగా మాట్లాడుతున్నరు.

– ఎ. శాంతమ్మ. ధోబీ గల్లి, కవాడీ గూడ

అందరికీ సాయం చేయాలె

ఆరోగ్యం మంచిగ లేకున్నా.. ఇంట్లకు వచ్చిన వరద నీళ్లను నేనే ఎత్తిపోసిన. వరద పైసలు ఇస్తున్నరని తెలిసి.. ఆఫీసర్లను, లీడర్లను అడిగితే పట్టించుకుంటలేరు. బాధితులందరికీ సాయం చేయాలె.

– జె.బసంతి, వినాయక్ నగర్, కవాడీ గూడ

పరిహారం ఇవ్వకపోతే రోడ్డుమీదే వంటావార్పు

వరద బాధితులందిరికీ సాయం అందేవరకు అండగా నిలబడి నిరసనలు కొనసాగిస్తం. ప్రభుత్వం, ఆఫీసర్లు స్పందించి బాధితులకు సహాయం అందజేయాలి. లేకపోతే  రోడ్డుమీదే వంటావార్పు కార్యక్రమం చేపడుతం.

– రమేశ్​ రామ్, ముషీరాబాద్ బీజేపీ నేత