మోదీజీ.. మీరే న్యాయం చేయాలి.. ఉద్వాసనకు గురైన సీఆర్పీఎఫ్​ జవాన్ విజ్ఞప్తి

మోదీజీ.. మీరే న్యాయం చేయాలి.. ఉద్వాసనకు గురైన సీఆర్పీఎఫ్​ జవాన్  విజ్ఞప్తి
  • పాకిస్తాన్  మహిళను పెళ్లాడిన విషయాన్ని దాచలేదు
  • ఉన్నతాధికారులకు చెప్పి అనుమతి తీసుకున్నానని వెల్లడి

జమ్ము: పాకిస్తాన్ మహిళను పెళ్లాడిన విషయాన్ని దాచిపెట్టావంటూ సీఆర్పీఎఫ్​ జవాన్ మునీర్  అహ్మద్ ను ఉన్నతాధికారులు డిస్మిస్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయనకు ఉత్తర్వులు పంపారు. దీంతో మునీర్  షాకయ్యాడు. ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయం తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని వాపోయాడు. జమ్మూలోని ఘరోత్రా ప్రాంతానికి చెందిన మునీర్.. ఆదివారం మీడియా సమావేశం పెట్టి మాట్లాడాడు. తాను పాకిస్తాన్  మహిళను పెండ్లాడిన మాట నిజమేనని, అయితే ఆ విషయాన్ని దాచలేదని చెప్పాడు. పెండ్లికి ముందే ఆ విషయం గురించి ఉన్నతాధికారులకు చెప్పి అనుమతి తీసుకున్నానని తెలిపాడు. 

కానీ, భద్రతా కారణాలని పేర్కొంటూ తనను డిస్మిస్  చేశారని తెలిపాడు. ఈ విషయం గురించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పానని, న్యాయం చేయాలని వేడుకున్నానని వెల్లడించాడు. అలాగే, అధికారుల నిర్ణయంపై కోర్టులోనూ సవాలు చేస్తానన్నాడు. ‘‘పాకిస్తాన్  మహిళ మీనాల్  ఖాన్ తో నా పెండ్లిని పెద్దలు నిశ్చయించారు. ఆమె నా మేనమామ కూతురు. దేశ విభజన సమయంలో నా మేనమామ పాక్ కు వలసవెళ్లారు. నేను, మీనాల్  ఆన్ లైన్ లో కలిసి, ప్రేమలో పడినట్లు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

అది నిజం కాదు. వాస్తవానికి మా నాన్న క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వీసా కోసం అప్లై చేస్తే ఆలస్యం అవుతుందని, అంతేకాకుండా మా నాన్న ఆరోగ్యం కూడా మరింత క్షీణిస్తుందన్న కారణంతో మేము ఆన్ లైన్ లో పెండ్లి చేసుకున్నాం. అప్పటికే నేను ఉన్నతాధికారులకు ఈ విషయం చెప్పి అనుమతి కూడా తీసుకున్నా” అని మునీర్  తెలిపాడు. తన తండ్రి ట్రీట్ మెంట్ కు అయిన ఖర్చులను సీఆర్పీఎఫ్​యే చెల్లించిందని వివరించాడు. 

కాగా.. పహల్గాం టెర్రర్  అటాక్  నేపథ్యంలో దేశ నుంచి వెళ్లిపోవాలని పాకిస్తానీయులకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో మునీర్  భార్య మీనాల్  చిక్కుల్లో పడింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న వాగాహ్–అటారీ బార్డర్  మీదుగా ఆమె మన దేశంలోకి ప్రవేశించింది. ఆమె స్వల్పకాలిక వీసా గడువు కూడా మార్చి 14న ముగిసింది. అయితే, ఆమె డిపోర్టేషన్​పై హైకోర్టు స్టే విధించింది. ప్రస్తుతం ఆమె జమ్మూలోని తన భర్త వద్ద ఉంటోంది.