
క్యాసినో హవాలా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్ కు ప్రాణహాని ఉందని.. భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురువారం చికోటి ప్రవీణ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2+2 గన్ మెన్ లతో రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. తన ఇంటి ముందు అనుమానాస్పదంగా వ్యక్తులు తిరుగుతుండగా తన అనుచరులు గుర్తించారన్నారు. ఆయన తరపు న్యాయవాది సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో.. చికోటి ప్రవీణ్ ఇంటి ముందు భారీగా అనుచరుల మోహరించారు. చికోటి ప్రవీణ్ ను చంపేందుకు తెర వెనుక కొన్ని శక్తులు పనిచేస్తున్నాయిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
క్యాసినో హవాలా కేసులో చికోటి ప్రవీణ్ ను ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చికోటి ప్రవీణ్, సంపత్, మాధవరెడ్డిలను ఈడీ విచారించింది. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు, మూడు రోజులుగా క్యాసినో వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ నేతలతో చికోటి ప్రవీణ్‌కు ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే చికోటి నుంచి ల్యాప్ ట్యాప్, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. అందులోని డేటాను పరిశీలిస్తున్నారు.