- వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్గా డిల్సీ రోడ్రిగజ్ నియామకం
- మదురో దంపతులను రిలీజ్ చేయాలని డిమాండ్
- వెనెజువెలాలో చమురు వెలికితీసి
- ఇతర దేశాలకు అమ్ముతం: అమెరికా
కరాకస్/వాషింగ్టన్: అమెరికా బలగాలు శనివారం తెల్లవారుజామున నిర్బంధించి తీసుకువచ్చిన వెనెజువెలా ప్రెసిడెంట్ నికోలస్ మదురో, ఆయన భార్య సీలియా ఫ్లోరెస్ ను ఆదివారం న్యూయార్క్ లోని డిటెన్షన్ సెంటర్ కు తరలించారు. చేతికి సంకెళ్లతో ఉన్న మదురోను డిటెన్షన్ సెంటర్ లో జైలు సిబ్బంది పట్టుకుని, నడిపించుకుంటూ తీసుకువెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వెనెజువెలాలో డ్రగ్స్ తయారీని ప్రోత్సహించారని, డ్రగ్ కార్టెల్స్ కు ఆశ్రయం ఇచ్చారని, అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అమెరికన్ల ప్రాణాలను తీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ మదురో, ఆయన భార్య, కొడుకు, మరో ముగ్గురిపై న్యూయార్క్ లో నార్కో టెర్రరిజం అభియోగాలు నమోదయ్యాయి. ఈ అభియోగాలపై ప్రాథమిక విచారణ నిమిత్తం మదురోను సోమవారం మాన్ హట్టన్ లోని ఫెడరల్ కోర్టులో అధికారులు హాజరుపర్చనున్నారు. కాగా, శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కరాకస్ పై మెరుపు దాడులు చేసిన అమెరికా బలగాలు.. మదురో, ఆయన భార్యను నిర్బంధించి, న్యూయార్క్ కు తరలించారు. కాగా, మదురో దంపతుల నిర్బంధం తర్వాత శనివారం ట్రంప్ మీడియాతో స్పందిస్తూ.. వెనెజువెలాను తాత్కాలికంగా పరిపాలిస్తామని ప్రకటించారు. ఆ దేశంలోని ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మెరుగుపరుస్తామని, పెద్ద ఎత్తున చమురును వెలికితీసి, ఇతర దేశాలకు విక్రయిస్తామన్నారు.
మదురో సవాల్.. పట్టుకెళ్లిన అమెరికా
వెనెజువెలా ప్రెసిడెంట్ మదురో గతంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అయింది. ‘‘నేను మిరాఫ్లోరెస్(వెనెజువెలా అధ్యక్ష భవనం)లోనే ఎదురు చూస్తున్నా. ధైర్యం ఉంటే వచ్చి నన్ను తీసుకెళ్లండి. ఆలస్యం చేయొద్దు” అంటూ ఆ వీడియోలో ట్రంప్ కు మదురో సవాల్ విసిరారు. మదురోను అరెస్ట్ చేసేందుకు సహకరించేవాళ్లకు రివార్డును రూ. 450 కోట్లకు పెంచుతూ ట్రంప్ ప్రకటన చేయడంతో మదురో ఈ మేరకు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో గత ఆగస్టు నుంచే మదురోను పట్టుకునేందుకు ప్లాన్ చేసిన అమెరికా బలగాలు శనివారం మెరుపు దాడులు చేసి, మిరాఫ్లోరెస్ లోకి చొరబడి ఆయనను నిర్బంధించి తీసుకెళ్లాయి. అలాగే మదురో సవాల్ చేసిన వీడియోతోపాటు అమెరికా బలగాల ఆపరేషన్ కు సంబంధించిన వీడియో క్లిప్ లను కూడా వైట్ హౌస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘‘మదురోకు ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది” అంటూ సెటైర్ వేసింది. ట్రంప్ కూడా ఇలాంటి వీడియోనే తన ట్రూత్ సోషల్ వేదికపై పోస్ట్ చేశారు.
గుడ్ నైట్.. హ్యాపీ న్యూ ఇయర్..
అమెరికా బలగాలు తనను బంధించి న్యూయార్క్ లోని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్(డీఈఏ) సెంటర్ కు తరలించిన సందర్భంగా మదురో వారికి విషెస్ చెప్పిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘‘డీఈఏ అధికారులకు ఆయన ‘గుడ్ నైట్.. హ్యాపీ న్యూ ఇయర్..’ అని విషెస్ చెప్పడం వీడియోలో కనిపించింది. ఇక శనివారం న్యూయార్క్ లోని మిలిటరీ బేస్ లో ల్యాండ్ అయిన తర్వాత చేతులకు సంకెళ్లతో ఉన్న మదురోను అధికారులు నడిపించు కుంటూ తీసుకెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది.
వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్గా డెల్సీ
మదురోను అమెరికా బలగాలు పట్టుకెళ్లిన నేపథ్యంలో వెనెజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్ గా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగజ్ నియమితులయ్యారు. దేశ సమగ్ర రక్షణ, పరిపాలన కొనసాగింపు కోసం వైస్ ప్రెసిడెంట్ డెల్సీని తాత్కాలిక ప్రెసిడెంట్ గా నియమిస్తూ ఈ మేరకు ఆ దేశ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం డెల్సీ రోడ్రిగజ్ స్పందిస్తూ.. మదురో దంపతులను వెంటనే రిలీజ్ చేయాలని అమెరికాను డిమాండ్ చేశారు. మదురో చట్టబద్ధంగా ఎన్నికైన నాయకుడన్నారు. కాగా, ‘ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్ (సంపూర్ణ పరిష్కారం)’ పేరుతో అమెరికా బలగాలు కరాకస్ పై జరిపిన మెరుపు దాడుల్లో అనేక మంది సోల్జర్లు, ప్రజలు చనిపోయారని ఆమె తెలిపారు. కచ్చితంగా ఎంత మంది మృతిచెందారన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అయితే, అమెరికా బాంబు దాడుల్లో 40 మంది మృతి చెందారని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.
