హైదరాబాద్, వెలుగు: డీఎస్సీ–2023 టీచర్లకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుల్గం దామోదర్ రెడ్డి, సుంకరి బిక్షంగౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీ ఆవరణలో శ్రీపాల్ రెడ్డి నేతృత్వంలో ఆ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ రూపొందించిన 2026 నూతన డైరీని సీఎం చేతుల మీదుగా ఆవిష్కరించారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో 57, అలాగే రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి 2003 డీఎస్సీ టీచర్లకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు పి. వెంకట్ రెడ్డి, జగన్మోహన్ గుప్తా, ఎస్. శ్రీనివాసరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.
