రెండో రోజు కొనసాగుతున్న ప్రభుత్వ బ్యాంకుల సమ్మె

రెండో రోజు కొనసాగుతున్న ప్రభుత్వ  బ్యాంకుల సమ్మె

ప్రైవేటీకరణను నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె రెండో రోజు కొనసాగుతోంది. దాదాపు 9 లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది విధులకు దూరంగా ఉన్నారు. దీంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా వరకు పనిచేయకపోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు.

పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రెండింటిని ప్రైవేటీకరిస్తామని కేంద్రం 2021–22 బడ్జెట్ లో ప్రతిపాదించింది. తద్వారా రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించిన సర్కారు బ్యాంకింగ్ చట్ట సవరణ బిల్లు 2021ను ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. బ్యాంకింగ్ కంపెనీస్ యాక్ట్ 1970 ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేంద్రం వాటా 51శాతంగా ఉంది. ప్రతిపాదిత బిల్లులో దాన్ని 26శాతానికి తగ్గించేలా సవరణలు చేశారు. శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లుకు చట్టరూపం ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బ్యాంకు సిబ్బంది రెండు రోజుల సమ్మె చేపట్టారు. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగులు హెచ్చరించారు.

For more news

ఇంటర్ లో మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని సూసైడ్

ఏడాది దాటిన.. పనులు పూర్తికాలే