
ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బుధవారం ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆయా జిల్లాలోని కలెక్టర్కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ జెండా ఎగురవేశారు. ఖమ్మం పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ లో అగ్రికల్చర్మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ, ప్రైవేట్కార్యాలయాలు, పార్టీ ఆఫీసుల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు.
రాజరిక పాలన నుంచి.. ప్రజా పాలన..
రాజరిక పాలన నుంచి ప్రజా పాలనకు నాంది పలికిన రోజు సెప్టెంబర్17 అని అగ్రికల్చర్మినిష్టర్తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతాంగ సాయుధ పోరాటంతో తెలంగాణ ప్రజలు నిజాం పాలనకు చరమగీతం పాడారన్నారు. ఎంతో మంది త్యాగాల వల్లనే ప్రజాస్వామ్య విలువలు స్థిరపడ్డాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. సీతమ్మ సాగర్‌లో 68 టీఎంసీల నీటి నిల్వతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరిందించడమే తమ లక్ష్యమన్నారు.
వైరా నదిలో నీళ్లు లేకున్నా, కృష్ణా నీళ్లు రాకున్నా 30 వేల ఎకరాలకు గోదావరి నీళ్లను అందిస్తున్నామన్నారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తి అయిన తర్వాత ఇల్లెందు, డోర్నకల్, మహబూబాబాద్‌కు గోదావరి నీళ్లు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తయితే మహారాష్ట్ర వరకు నౌకాయానం జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. మరోవైపు కొత్తగూడెం నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఇటీవల పౌర విమానయానశాఖ మంత్రిని కలిశామన్నారు. నౌకాయానంతోపాటు విమానయానంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
కొత్తగూడెం చుట్టూ రూ. 420 కోట్లతో బైపాస్‌రోడ్డు నిర్మించనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఇల్లెందు, కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలానికి ఎన్ హెచ్శాంక్షన్ అయిందన్నారు. లాభదాయక వ్యవసాయానికి కేరాఫ్అడ్రస్గా భద్రాద్రికొత్తగూడెం జిల్లా మారుతోందన్నారు. దేశంలోనే ఆయిల్ పాం హబ్‌గా జిల్లా మారబోతోందని తెలిపారు. 42శాతం రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు.
బీసీ రిజర్వేషన్ల మూలంగానే స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని తెలిపారు. కేంద్రం పెద్ద మనసు చేసుకొని బీసీ రిజర్వేషన్లను ఆమోదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావ్, కలెక్టర్ జితేశ్వి.పాటిల్, ఎస్పీ బి.రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో రాహుల్, అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ పాల్గొన్నారు.