జవహర్ నగర్ వద్ద ఉద్రిక్తత

జవహర్ నగర్ వద్ద ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపియ్ యార్డు వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డంపింగ్ యార్డును ఎత్తివేయాలంటూ ప్రజా ప్రతినిధులు ధర్నా చేపట్టారు ఇటీవలే కురిసిన వర్షాలకు డంపింగ్ యార్డు నుంచి విష వాయువులు వెలువడుతున్నాయని, ఫలితంగా కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెల్లడించారు. కాలనీ వాసులతో కలిసి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు కలిసి రాంపల్లి చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. దీంతో భారీగా స్తంభించిపోయింది. కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాంకీ..సంస్థ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. విషపు మురుగునీరు ఇళ్లలోకి వదిలేస్తున్నారని ప్రజలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, డంపింగ్ యార్డు యాజమాన్యం వెంటనే ఇక్కడకు రావాలంటూ డిమాండ్ చేశారు. అఖిలపక్ష నాయకులను అదుపులోకి తీసుకుని కీసర పీఎస్ కు తరలించారు. అయితే.. జవహర్ నగర్ సీఐ ఓవరాక్షన్ చేశారు. కవరేజ్ చేస్తున్న మీడియాను పక్కకు నెట్టేసి.. మైకులు తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత వారం కిందనే మున్సిపల్ చైర్మలతో కలిసి రాంకీ సంస్థతో మాట్లాడడం జరిగిందన్నారు. చెత్త ఫిల్టర్ చేయడానికి నెలు రూ. 10 కోట్లు ఇస్తున్నామని, అయినా రాంకీ సంస్థ ఇళ్ల మధ్యకు మురికి నీళ్లు వదలడం సమంజసం కాదన్నారు. తమ పార్టీ నాయకులు ధర్నా చేస్తున్నారని తెలుసుకున్నట్లు.. తాను వెళ్లి పోలీసులతో మాట్లాడుతానని తెలిపారు. 

ఇక జవహార్ నగర్ డంపింగ్ యార్డు విషయానికి వస్తే... ఈ యార్డు వల్ల గాల్లోకి విషం చిమ్ముతోంది. దాదాపు 18 గ్రామాల ప్రజలు శ్వాస పీల్చుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు. వ్వర్థాల నిర్వహణ లోపాలతో తమ బతుకులు ఛిద్రం అవుతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. వర్షకాలంలో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది. డంపింగ్ యార్డు పనులు మొదలైనప్పుడు గ్రేటర్ నుంచి 2 వేల నుంచి 3 వేల టన్నుల చెత్త చేరేది. దీనికి తగ్గట్టు రాంకీ పలు చర్యలు తీసుకొనేది. కానీ నగరం విస్తరిస్తున్న క్రమంలో.. చెత్త భారీగా జమ అవుతోంది. భూగర్భ జలాలు కలుషితమౌతున్నాయి. దోమలు, ఈగలు, ప్లాస్టిక్ కవర్లు, చెత్త కాగితాలతో జనావాసాలు మురికి కూపాలుగా మారిపోతున్నాయని ప్రజలు వెల్లడిస్తున్నారు. మరి ఈ డంపింగ్ యార్డు విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వెయిట్ అండ్ సీ.