టెస్టులు చేస్తలేరని తిరగబడుతున్న జనాలు

టెస్టులు చేస్తలేరని తిరగబడుతున్న జనాలు
  • పీహెచ్​సీల్లో రోజూ 30లోపే  చేస్తున్నరు
  • ఫీవర్ సర్వేతో పలువురిలో అనుమానాలు
  • నిర్ధారణ కోసం సెంటర్లకు వెళ్తే వెనక్కి పంపిస్తుండడంతో తిరగవడ్తున్నరు

నాగర్ కర్నూల్ టౌన్/ నెట్​వర్క్, వెలుగు: కరోనా టెస్టుల కోసం రోజూ సెంటర్ల చుట్టు తిప్పించుకుంటున్నరని పబ్లిక్​ ఫైర్ అయితున్నారు. మబ్బుల్నే లేచొచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడితే టెస్టులు చేయకుండానే వెనక్కి పంపిస్తున్నారని ప్రజలు మర్లవడుతున్నారు. రోజు రోజుకు టెస్టుల సంఖ్య తగ్గిస్తున్న రాష్ట్ర సర్కార్​పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సర్కార్ హైస్కూళ్లో ఏర్పాటు చేసిన కరోనా టెస్ట్ సెంటర్​కు సోమవారం ఉదయం నుంచే పబ్లిక్ బారులుతీరారు. పొద్దున ఎనిమిది గంటల వరకు 400 మందికి పైగా టెస్టుల కోసం వచ్చారు. కిట్లు లేవని కేవలం 50మందికే  టెస్టులు చేస్తామని అక్కడి హెల్త్​స్టాఫ్​ చెప్పడంతో కొన్ని గంటలుగా క్యూలైన్లలో నిల్చున్న వారు ఓపిక నశించి ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. పట్టరాని కోపంతో సెంటర్ ముందు వేసిన టెంటు కూలగొట్టి, కుర్చీలు విరగ్గొట్టారు. తర్వాత అక్కడే రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో భారీగా వెహికల్స్ నిలిచిపోయాయి. కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్నామని, ఫీవర్ సర్వేలోనూ తమకు ఇదే విషయం చెప్పారని, టెన్షన్​తో టెస్టుల కోసం వస్తే చేయడం లేదన్నారు. తమకు కరోనా వచ్చిందనే అనుమానంతో  ఎవరూ షాపుల్లోకి రానివ్వడం లేదని ఉప్పు, పప్పు, కూరగాయలు కూడా కొనుక్కోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులను సముదాయించి పంపించారు.

టెస్టులు తగ్గించిన సర్కారు
రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజులుగా కరోనా టెస్టులు తగ్గించింది. ఏప్రిల్​లో ఒక దశలో ప్రతిరోజూ లక్ష కుపైగా టెస్టులు చేసిన సర్కారు, మేలో క్రమంగా తగ్గిస్తోంది. మే1న రాష్ట్ర వ్యాప్తంగా 80వేల టెస్టులు చేసిన సర్కారు, మే 16న 44,985, మే 17న62,591 టెస్టులను మాత్రమే చేసింది. వీటిని పరిశీలిస్తే పెద్దసంఖ్యలో టెస్టులు తగ్గించినట్లు స్పష్టమవుతోంది. డిమాండ్​కు తగ్గట్లు టెస్టులు చేయలేకే ఈ నెలలో ఫీవర్ సర్వే చేపట్టింది. సర్వే తర్వాత హాస్పిటళ్లకు యాంటిజెన్ కిట్ల సప్లైలో కోతపెట్టింది. నెలకింద ఒక్కో జిల్లాలో రోజూ 2వేల నుంచి 3వేల టెస్టులు చేయగా, కొద్దిరోజులుగా వెయ్యికి అటూ ఇటుగా చేస్తున్నారు. జిల్లా దవాఖాన్లకు 100, సీహెచ్​సీలకు 50 లోపు, పీహెచ్​సీకి 20 నుంచి 30 కిట్లు మాత్రమే సప్లై చేస్తున్నారు. మరోవైపు ఫీవర్ సర్వేలో ఇప్పటికే లక్షలాది మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈ సర్వే చేస్తున్న ఆశావర్కర్లు, ఏఎన్​ఎంలు ఎలాంటి టెస్టులు చేయకుండానే కేవలం ఫీవర్, దగ్గు, జలుబు లాంటి లక్షణాల ఆధారంగా మెడికల్ కిట్లు ఇచ్చి, 15 రోజులు క్వారంటైన్​లో ఉండాలని చెప్పి వెళ్తున్నారు. అనుమానం ఉంటే టెస్టు చేయించుకోమంటున్నరు. దీంతో తమకు కరోనా ఉందో లేదో తెలియక టెన్షన్ పడుతున్న బాధితులు టెస్టింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. కానీ హెల్త్​ స్టాఫ్ కొన్ని టెస్టులు మాత్రమే చేసి ఆపై చేతులెత్తేస్తున్నారు. క్యూలో ఉన్నవాళ్లను రేపు రావాలని చెప్పి పంపిస్తున్నారు. దీంతో జనం వైద్యసిబ్బందిని నిలదీస్తున్నారు.

మందులిచ్చి పంపుతున్నరు.. 
జనగామ జిల్లా రఘునాథపల్లి పీహెచ్​సీకి సోమవారం 30మంది రాగా, కేవలం ఏడుగురికి మాత్రమే ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు నిర్వహించారు. కిట్లు అయిపోయాయని చెప్పారు. మిగిలిన 23 మందికి ఎలాంటి టెస్టులు చేయకుండానే కరోనా ఐసోలేషన్ కిట్ ఇచ్చి పంపించేశారు. అందరినీ15రోజులు క్వారంటైన్​లో ఉండాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి పీహెచ్​సీ పరిధిలో చొప్పదండి మున్సిపాలిటీతో పాటు 16 గ్రామాలున్నాయి. నెల రోజుల నుంచి ఈ మండలంలో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. ప్రతి రోజూ 200 నుంచి 300 మంది వస్తుండగా, 40 నుంచి 50  మందికి మాత్రమే టెస్టులు చేస్తున్నారు. దీంతో టెస్టుల కోసం వచ్చిన పబ్లిక్​ హెల్త్ స్టాఫ్​తో గొడవకు దిగుతున్నారు. సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి పీహెచ్ సీ లో నెల క్రితం వరకు ప్రతిరోజూ 100 వరకు టెస్టులు చేసేవారు. ప్రస్తుతం రోజుకు 18 టెస్టులు మాత్రమే చేస్తున్నారు. ప్రతి రోజు 70 మందికిపైగా వచ్చి కిట్లు సరిపోక వెనుదిరుగుతున్నారు. గ్రేటర్​ వరంగల్ పరిధిలోని సమ్మయ్యనగర్ పీహెచ్​సీకి సోమవారం100 మంది వరకు వచ్చారు. కానీ  40 మందికే టెస్టులు చేయడంతో మిగతా వారు నిరాశగా వెనుదిరిగారు. ములుగు జిల్లా ఏటూరునాగారం హాస్పిటల్​లో కరోనా టెస్టుల కోసం రోజూ 150 నుంచి 200 మంది వస్తుండగా కేవలం ముందుగా వచ్చిన 50 మందికే టెస్టులు చేస్తున్నారు. ఏ సెంటర్​లో చూసినా ఇదే పరిస్థితి. దీంతో జనం ప్రైవేట్ ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.800 వరకు పెట్టి ర్యాపిడ్ టెస్టులు, రూ.1500 నుంచి రూ.2వేల దాకా పెట్టి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకుంటున్నారు.

మూడు రోజులుగా తిరుగుతున్న
నేను బల్మూర్ మండలం గట్టుతుమ్మెన్ గ్రామం నుంచి వచ్చిన. నాకు కరోనా లక్షణాలు ఉన్నయి. టెస్టు కోసం మూడు రోజులుగా తిప్పించుకుంటున్నరు. తిండి తిప్పలు పట్టించుకోకుండా మూడు రోజుల సంది వచ్చిపోతున్న. ఈ రోజు కూడా చేయబోమని వాపస్ పంపిచిన్రు. ఇంత అన్యాయం ఉంటదా? 
- శివలీల, గట్టుతుమ్మెన్, నాగర్​కర్నూల్ జిల్లా