యూటర్న్ ఉన్నా రాంగ్​ రూట్​లోనే

 యూటర్న్ ఉన్నా రాంగ్​ రూట్​లోనే
  • సిటీలో ఎక్కడ చూసినా ఇదే సీన్
  • యూటర్న్ ఉన్నా వెళ్లని పలువురు వాహనదారులు
  • వన్ వేలో పోతున్న వారికి వస్తున్న ఇబ్బందులు
  • పట్టించుకోని ట్రాఫిక్ పోలీసులు
  • రాత్రిపూట స్పీడ్ గా వెళ్తుండగా ప్రమాదాలు

 “  నేను శనివారం మధ్యాహ్నం మెహిదీపట్నం నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తున్నా. మాసబ్ ట్యాంక్ ఫ్లై ఓవర్ వరకు ట్రాఫిక్ జామ్ ​అయింది.  ఓ వ్యక్తి బైక్ పై సరోజిని దేవి కంటి హాస్పిటల్ వైపు నుంచి రాంగ్ ​రూట్​లో  సడెన్​గా ఎదురొచ్చాడు.  వెంటనే నేను బ్రేక్​ వేయకుంటే బైక్​తో  ఢీ కొట్టేవాడిని. అతడిపై గట్టిగా అరిచినా పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. ట్రాఫిక్ లో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. రద్దీ ఏరియాల్లో ట్రాఫిక్ పోలీస్ ఉంటే బాగుండు.’’ అని ప్రైవేట్​ ఎంప్లాయ్ సంతోష్ చెప్పిండు. 

“ షేక్ పేట్ నుంచి గచ్చిబౌలి వెళ్లే రూట్ లో డీమార్ట్ కు  కొంచెం దూరంలో యూటర్న్ ఉంది. అది రద్దీ ఏరియా. ఆటోవాలాలు, బైక్ లపై వెళ్లే వాళ్లు దూరం వెళ్లి యూటర్న్ తీసుకోకుండా ఎదురుగా రాంగ్​రూట్​లో వెళ్తుంటారు.  ట్రాఫిక్ పోలీసులు లేకపోవడంతో ఇష్టానుసారంగా స్పీడ్ గా ఎదురుగా వెళ్తూ వాహనదారులకు ఇబ్బందులు తెస్తుంటారు. కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి. ’’

హైదరాబాద్, వెలుగు: సిటీలో రాంగ్​ రూట్​లో వెళ్లే వాళ్లతో ఇతర వాహనదారులకు ఇబ్బందిగా మారుతోంది. రద్దీ ఏరియాల్లో రాంగ్ రూట్ లో  వెళ్తుండగా, వన్ వేలో వెళ్లే వాహనదారులు  సడెన్​గా బ్యాలెన్స్ చేయలేక అదుపుతప్పి  ఢీ కొట్టడమో,  స్కిడ్​ అయి కిందపడిపోవడం వంటి ఘటనలు రోజూ కనిపిస్తున్నాయి.  కొన్నిసార్లు  యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ఎక్కువగా యూ టర్న్​ల వద్ద రాంగ్ రూట్ వచ్చేవాళ్లతోనే  ప్రమాదాలు జరుగుతున్నాయి.  కొంచెం దూరం వెళితే యూటర్న్​ ఉంటుందని తెలిసినా కూడా వెళ్లకుండా ఎదురుగా వస్తూ రోడ్డు దాటుతున్నారు.  ఎదురుగా వచ్చే వాహనాలకు అడ్డంగా టర్న్ తీసుకుని వెళ్తున్నారు.  ట్రాఫిక్  లెక్కల ప్రకారం 2020లో సిటీలో   లక్షా56 వేల 632 , 2021లో    లక్షా 93వేల 703  రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క ఏడాది తేడాలోనే దాదాపు 40 శాతం కేసులు పెరిగాయి. యూ టర్న్​లు,  ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సిగ్నళ్లు, వన్ వే, నో ఎంట్రీ ఏరియాల్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ లపై సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.  చలాన్లు  వేస్తున్నా వాహనదారుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. సిటీలోని కుషాయిగూడ, పంజాగుట్ట, జూబ్లీహిల్స్ లో రోడ్ నం. 5, కృష్ణానగర్, మాసబ్ ట్యాంక్ తదితర  ప్రాంతాల్లో  రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కూడా వస్తుండడంతో వన్ వే లో వెళ్తున్న వారికి ఇబ్బందులు తప్పడంలేదు.

రాత్రి పూట డేంజర్​గా.. 
 రాత్రి పూట రాంగ్ ​రూట్​లో స్పీడ్​గా వెళ్తుండగా చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని ఏరియాల్లో లైట్లు సరిగా లేక దగ్గరకు వచ్చేవరకు వాహనాలు కనపడడం లేదు. రోడ్డు మీద ఎడమ వైపు డ్రైవ్ చేస్తూ వెళ్తున్న వారికి కూడా ఎదురుగా వచ్చే వాహనదారులతో ఇబ్బందులు వస్తున్నాయి. సడెన్ గా ఎదురుగా వెహికల్ వస్తుండడంతో నేరుగా వెళ్తున్న వారు ఒక్కసారిగా భయాందోళనకు లోనై ఢీ కొట్టడడమో, లేదంటే  ఒక్కసారిగా బ్రేక్​ వేయగా స్కిడ్​ అయి కింద పడిపోవడం లాంటివి అవుతున్నాయని గచ్చిబౌలికి చెందిన శ్వేత చెప్పింది.