బస్సులన్నీ సీఎం సభకు వెళ్లడంతో ఊళ్లకు వెళ్లే పబ్లిక్​ పరేషాన్​

బస్సులన్నీ సీఎం సభకు వెళ్లడంతో ఊళ్లకు వెళ్లే పబ్లిక్​ పరేషాన్​
  • అదనంగా వెహికిల్స్ తీసుకెళ్లిన లీడర్లు 
  • అన్ని రూటల్లో కిక్కిరిసిన ప్రయాణాలు
  • ప్రైవేట్ వాళ్లు చార్జీలు పెంచేశారు

హనుమకొండ, వెలుగు: హుజురాబాద్​లో సీఎం కేసీఆర్​సభ సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులను సీఎం సభకు తరలించడంతో ప్యాసెంజర్లు నానా కష్టాలు పడ్డారు. ఏ డిపో నుంచి ఎన్ని బస్సులు సీఎం సభకు తీసుకెళ్లాల్లో ముందుగా అనుకున్నారు. మిగిలిన బస్సులను రద్దీ రూట్లలో నడిపి కొంతలో కొంతయినా సర్వీసు ఇవ్వాలని ఆఫీసర్లు భావించారు. కానీ, లోకల్​ టీఆర్​ఎస్​​ లీడర్లు మరిన్ని బస్సులను తీసుకెళ్లారు. దీంతో సోమవారం అన్ని రూట్లలో పబ్లిక్​ అవస్థలు పడాల్సివచ్చింది. సరిపడా బస్సులు లేక ప్యాసెంజర్లు ఉన్నవాటిలోనే కిక్కిరిసి ప్రయాణించాల్సి వచ్చింది. బస్సుల్లో ఇరుక్కుని వెళ్లలేక చాలామంది ప్రైవేటు వెహికిల్స్​ ను ఆశ్రయించారు.  ఇదే అదునుగా ఆటోలు, జీపుల వాళ్లు  ఎక్కువ  ఛార్జీలు వసూలు చేశారు. 

సర్వీసులు తగ్గించిన్రు

దళితబంధు ప్రారంభించేందుకు హుజూరాబాద్​ మండలం శాలపల్లి ఇంద్రానగర్​లో నిర్వహించిన సీఎం సభకు దాదాపు 40 వేల మందిని తరలించేందుకు ఆఫీసర్లు, టీఆర్​ఎస్​ నేతలు  ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ కోసం చుట్టుపక్కల  జిల్లాలకు చెందిన  డిపోల నుంచి ఆర్టీసీ బస్సులు కేటాయించారు. దాదాపు 825 బస్సుల్లో జనాలను తరలించారు.  హుజూరాబాద్​కు పక్కన ఉన్న వరంగల్​ రీజియన్​ నుంచి 220 బస్సులు కేటాయించారు. అయితే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన వాటికన్నా ఎక్కువ బస్సులు కావాలని ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చారు. వారి మాట కాదనలేక ఆఫీసర్లు వివిధ రూట్లలో సర్వీసులు తగ్గించి మరో 40 బస్సులు హుజురాబాద్​కు నడిపారు. దీంతో సరిపడా బస్సులు లేక..  ఉన్న బస్సుల్లో తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు  పడరాని పాట్లు పడ్డారు. హూజూరాబాద్​కు చుట్టూఉన్న ఉమ్మడి కరీంనగర్​, వరంగల్,  ఆదిలాబాద్, మెదక్​ జిల్లాలకు చెందిన బాలా ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 

గంటల కొద్దీ ఎదురుచూపులు

బస్సులు చాలావరకు సీఎం సభకు తరలించడంతో ఉన్న బస్సులనే అన్ని రూట్లలో అడ్జస్ట్​చేసేందుకు ఆఫీసర్లు తంటాలు పడ్డారు. తక్కువగా ఉండే రూట్లలో సర్వీసులను తగ్గించారు. దీంతో ఆయా రూట్లలో ప్రయాణీకులు  గంటలకొద్దీ ఎదురుచూడాల్సి వచ్చింది. హనుమకొండ బస్టాండ్​ నుంచి రోజు దాదాపు 80 వేల మంది వివిధ రూట్లలో ప్రయాణం చేస్తుంటారు.  హైదరాబాద్​, కరీంనగర్​, ఆదిలాబాద్​ జిల్లాలకు వెళ్లేవారు ఎక్కువగా ఉంటారు.  రీజియన్​ లో ఉన్న మొత్తం 950 బస్సులను ఆపరేట్​ చేసినా ప్రయాణికుల అవసరాలను పూర్తిగా తీర్చలేవు. ఇప్పటికే అద్దె బస్సులు నడవకపోవడం,  సీఎం సభకు బస్సులను కేటాయించడంతో హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వెళ్లే వృద్ధులు, స్టూడెంట్లు  ఇబ్బందులు పడ్డారు. 

అదనంగా వసూళ్లు

బస్సులు లేక బస్టాండుల్లో రష్​పెరగడంతో బస్సుల కోసం ఎగబడాల్సి వచ్చింది. హుజురాబాద్​ చుట్టుపక్కల అన్ని బస్టాండ్లలో ఇదే పరిస్థితి కనిపించింది. చాలాసేపు వేచిఉన్నా బస్సుల్లో ప్లేస్​ దొరకకపోవడంతో  ప్రైవేటు వెహికిల్స్​ను ఆశ్రయించారు.  ప్రైవేటు వెహికిల్స్​ ఛార్జ్​లు పెంచేశాయి. హైదరాబాద్​ మామూలుగా  రూ. 250 వసూలు చేసే వెహికల్​ ఓనర్లు ఈరోజు అదనంగా రూ. 50 నుంచి రూ. 100 వసూలు చేశారు. 

గంట సేపు చూసినా బస్సు రాలే
నేను హనుమకొండలో ఉంటూ చదువుకుంటున్నా. పని ఉండి ఇంటికి వచ్చా. తిరిగివెళ్దామంటే ఒక్క బస్సు కూడా లేదు.  గంటసేపటి నుంచి  ఎదురుచూస్తున్నా బస్సు రాలె. ఇక్కడున్న ఆఫీసర్లను అడిగినా ఏం చెప్తలేరు. 
-శ్యాంరాజ్​, కాళేశ్వరం

ప్రజల్ని ఇబ్బంది పెడతారా..

పర్సనల్​ పని మీద కరీంనగర్ వెళ్లి వస్తున్నాను. అక్కడి నుంచి హనుమ కొండకు వచ్చిన బస్సులో రష్​ ఎక్కువ గా ఉంది. ఇక్కడి నుంచి కాటారం వెళ్లేందుకు ఒక్క బస్సూ లేదు.  సీఎం సభ కోసం బస్సులు తీసుకుని  ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్​ కాదు.

- కొట్టే లక్ష్మణరావు​, కాటారం