హైదరాబాద్ లో సీవరేజ్ నిర్వహణలో నిర్లక్ష్యం.. సమగ్ర విచారణకు ఆదేశం

హైదరాబాద్ లో సీవరేజ్ నిర్వహణలో నిర్లక్ష్యం.. సమగ్ర విచారణకు ఆదేశం

హైదరాబాద్ లో డ్రైనేజీ సమస్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ, అక్కడ అని కాదు.. సిటీలోని అన్ని ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. సీవరేజ్ సమస్యపై జనం నుంచి GHMC కి ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. డ్రైనేజీ పొంగడమే కాదు..  మురికి నీళ్లు, మంచినీళ్లలో కలుస్తున్నాయని ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని పబ్లిక్ అంటున్నారు.

బస్తీల నుంచి హైటెక్ సిటీ వరకు..

గ్రేటర్ హైదరాబాద్ లో చిన్న చిన్న బస్తీల నుంచి హైటెక్ సిటీ వరకు ఇలా అన్ని ఏరియాల్లో రోడ్లపై డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. వర్షం పడి కూడా వారం పదిరోజులు అయిపోయింది. అయినా చాలా ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. నగరవాసుల ట్విట్టర్ తో పాటు GHMC కంట్రోల్ రూమ్ కు కాల్స్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. వాటర్ బోర్డ్ అధికారుల లెక్కల ప్రకారం గ్రేటర్ పరిధిలో 109 చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నట్లు తెలుస్తోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, బంజారాహిల్స్, బేగంపేట్, ఉప్పల్, రామంతాపూర్, బోరబండ, జూబ్లీహిల్స్, ఫలక్ నుమా, వనస్థలిపురం, నాగోల్ లాంటి ఏరియాల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు చెబుతున్నారు.

వాటర్ బోర్డ్ ఎండీ దానకిషోర్ ఆగ్రహం..

సీవరేజ్ సమస్య విషయంలో అధికారుల పనితీరుపై వాటర్ బోర్డ్ ఎండీ దానకిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఆయన విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు బస్తీల్లో పర్యటించిన సందర్భాల్లో బస్తీల్లో నీటి సరఫరా, సీవరేజ్ నిర్వహణను పరిశీలించారు. ఈ మధ్యే షేక్ పేటలోని ఓయూ కాలనీకి వెళ్లిన సమయంలో.. సీవ రేజ్ ఓవర్ ఫ్లో అవుతుండడాన్ని గమనించిన ఎండీ దానకిశోర్ షేక్ పేట్ సబ్ డివిజన్ డీజీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీవరేజ్ నిర్వహణ కోసం ఎయిర్ టెక్ మిషన్లు అందుబాటులో ఉన్నప్పటికీ, బడ్జెట్ కేటాయించినా నిర్లక్ష్యం వహించడంపై మండిపడ్డారు. సీవరేజ్ నిర్వహణలో నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించాలని దానకిశోర్ విజిలెన్స్ అధికారులను ఆదేశించారు.

సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇబ్బందులు..

రోడ్ల మీద డ్రైనేజీ నీళ్లు పొంగకుండా చూస్తున్నామని.. ఏదైనా ప్రాంతాల్లో సిబ్బంది నిర్లక్ష్యంతోనే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటే యాక్షన్ తీసుకుంటున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విజిలెన్స్ అధికారులతో పూర్తిస్థాయి సర్వే చేపిస్తున్నామని.. ఎక్కడెక్కడ రోడ్ల మీద డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లుతున్నాయో వివరాలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక డ్రైనేజీ నీళ్లు పొంగిపొర్లి..మంచినీళ్లలో కంపు వాటర్ మిక్స్ అయ్యి పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారు. బేగంబజార్ పరిసర ప్రాంతాల్లో చాలా రోజులుగా మంచినీళ్లలో డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయని.. వాటిని తాగలేకపోతున్నామని పబ్లిక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా అక్కడి నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదని చెప్తున్నారు.